సాక్షి, చైన్నె: తమిళనాడు డీజీపీకి చైన్నె హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమ గ్రానైట్ మైనింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహాయంకు తక్షణమే తుపాకీతో కూడిన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ భద్రతను కల్పించాలని న్యాయమూర్తి సూచించారు. మధురై జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమ గ్రానైట్ తవ్వకాలను సహాయం వెలుగులోకి తెచ్చారు. ఆతదుపరి పరిణామాలతో సమగ్ర విచారణ జరిపేందుకు హైకోర్టు సహాయంను ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది. ప్రభుత్వానికి సుమా రు రూ.1,11,000 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా మధురై ప్రత్యేకకోర్టులో విచారణ కొనసాగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు 2014 నుండి ఆయనకు అందిస్తున్న పోలీస్ సెక్యూరిటీని 2023లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉపసంహరించుకున్నారు. కాగా నిందితుడి ఆభ్యర్థన మేరకు హైకోర్టు తక్షణమే కనీసం ఒక తుపాకీ పోలీసుతో భద్రత పునరుద్ధరించాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. సహాయం భద్రతపై దాఖలైన వినతిపత్రాన్ని సమగ్రంగా సమీక్షించాలని సూచించారు.


