వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయానికి అనుబంధ ఆలయమైన తిరువణ్ణామలైలోని క్రివాలాబతిలోని ప్రధాన ఆలయాల్లో ఇడుకు వినాయకుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో గుహలాండి మూడు ప్రవేశాలున్నాయి. వెనుక ద్వారం గుండా పడుకొని ఈ ఆలయంలోకి ప్రవేశించి చేతులు జోడించి నెమ్మదిగా కదిలి ముందు ద్వారం గుండా బయటకు రావాలి. కాగా రెండు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన దాసరి మణిమకుమార్ గుహలో చిక్కుకొని శ్వాస ఆడకుండా మృతి చెందగా, ఆదివారం సాయంత్రం ఆంధ్ర రాష్ట్రానికే చెందిన మరో మహిళ ఈ గుహలో చిక్కుకొని ఊపిరి ఆడకుండా పోవడంతో ఆస్పస్థతకు గురయ్యారు. దీంతో అరుణాచలేశ్వరాలయ జాయింట్ కమిషనర్ భరణీధరణ్ ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా ఆలయం వద్ద వృద్ధులు, గర్భవతులు, స్థూలకాలం ఉన్నవారు గుహలోనికి వెళ్లరాదని సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
తిరువళ్లూరు: చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్‌లో ఇన్‌ప్లోను అంచనా వేయడంతో పాటు రిజర్వాయర్‌కు నీటి మట్టం అమాంతం పెరిగే సమయంలో ఆటోమెటిక్‌గా షట్టర్‌లను ఎత్తుడానికి రూ.32 కోట్ల వ్యయంతో సెన్సార్ బోర్డు, శాటిలైట్ నిఘా పరికరాలను ఏర్పాటు చేసినట్టు పీడబ్ల్యూడీ అధికారులు వెల్లడించారు. కాగా చైన్నెకు తాగునీటిని అందించే పూండి, పుళల్, చోళవరం, చెమరంబాక్కం తదితర రిజర్వాయర్‌లను నిత్యం పర్యవేక్షణ, నీటి ఇన్‌ప్లోను నియంత్రించడం, డేటా సేకరణ, మిగులు జలాలను దిగువకు విడుదల చేయడానికి సెన్సార్ టెన్నాలజీని ఉపయోగించాలని తాజాగా నిర్ణయించారు. ఇందు కోసం ఇన్‌ఫ్లోను అంచనా వేయడానికి శాటిలైట్‌ను, అత్యవసర సమయంలో గేట్లును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడానికి సెన్సార్ బోర్డులను పూండి రిజర్వాయర్‌లో అమర్చారు.
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా బాల్‌రెడ్డి కండ్రిగకు చెందిన వికలాంగురాలైన హేమావతి తన ఇద్దరుపిల్లలు కుమారరాజ, చిత్రతో కలిసి తమ సొంతింట ఉంటున్నారు. ఈ క్రమంలో హేమావతి పేరిట ఉన్న ఇంటి పట్టాను రెవెన్యూ అధికారులు, అదే గ్రామానికి చెంది 30 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట బదలాయించారు. ఇది తెలుసుకున్న హేమావతి దీనిపై తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కవితను కలిసింది. తమకు న్యాయం చేయడంతో పాటు తప్పు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. కలెక్టర్ దీనిపై స్పందించారు. బాధితులకు న్యాయం చేయాలని ఊత్తుకోట పోలీసు లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
స్టాలిన్‌కు వ్యతిరేకంగాహైకోర్టులో పిటిషన్
సాక్షి, చైన్నె: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్‌ను ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేశారు. డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్‌లో అనేక విషయాలను గోప్యంగా ఉంచారని, వాస్తవానికి ట్రస్టుకు సంబంధించిన వివరాలతో పాటుగా మరెన్నో వివరాలను పొందుపరచ లేదని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ ధర్మాధికారి బెంచ్ పరిశీలించింది. అయితే, వివరాలన్నీ తమిళంలో ఉండటంతో ఆంగ్లంలో తర్జుమా చేసి సమర్పించాలంటూ పిటిషన్‌కు సమయాన్ని కేటాయించారు. అనంతరం విచారణను 29వ తేదీకి వాయిదా వేశారు.
నిజాయితీతో పనిచేయాలి
సాక్షి, చైన్నె : ప్రశ్నా పత్రాలను తయారు చేసే ఉపాధ్యాయులు నిజాయితీతో పనిచేయాలని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి. కామకోటి తెలిపారు. కేంద్రం ప్రభుత్వం పరీక్షల సంస్కరణకు సంబంధించి నియమించిన ఉన్నత స్థాయి టాస్క్‌పోర్స్ కమిటీలో తనకు అవకాశం కల్పించిన నేపథ్యంలో సోమవారం చైన్నెలో వి. కామకోటి సోమవారం మాట్లాడుతూ, ప్రశ్నా పత్రాలను తయారుచేసే ఉపాధ్యాయులు నిజాయితీతో వ్యవహరించాలని, బాధ్యతతో పనిచేయాలని హితవు పలికారు. అలాగే, ప్రశ్న పత్రాలను సాంకేతిక పరంగా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.


