ఆగస్టు 1న రాహుల్‌ రాష్ట్ర పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 1న రాహుల్‌ రాష్ట్ర పర్యటన

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఏఐసీసీ చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆగస్టు 1న తమిళనాడులో పర్యటించనున్నారని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న సెల్వపెరుంతొగైను తప్పించి మాణిక్యం ఠాకూర్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేస్తూ కొత్త జిల్లా అధ్యక్షులను నియమించి వారికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో యువతను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేర్పించడం, శ్రేణుల్లో రాజకీయ చైతన్యం నింపడం లక్ష్యంగా రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ తమిళనాడులో పర్యటించి బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ పరిస్థితులలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ ప్రకటనను ప్రస్తావిస్తూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌ వివరాలను ప్రకటించారు.

రాష్ట్ర పర్యటనకు రాక

రాహుల్‌ గాంధీ రాక తమిళనాడు కాంగ్రెస్‌ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని, నూతనోత్తేజాన్ని నింపుతుందని వ్యాఖ్యలు చేశారు. 2029 పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని భారత ప్రధానిని చేయడమే లక్ష్యంగా తమిళనాడు కాంగ్రెస్‌ తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ తమిళనాడు పర్యటన ప్రకటనతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో అప్పుడే భారీ అంచనాలు, ఉత్సాహం నెలకొన్నాయని పేర్కొంటూ, ఆగస్టు 1న ఇక్కడకు రానున్నట్టు ప్రకటించారు. కాగా, చైన్నె శివారులో కాంగ్రెస్‌ నేతలకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం ముగింపు వేడుకలో రాహుల్‌ గాంధీ ప్రసంగించే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్‌ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement