– పీఎంకే మాదిరి ఆర్థిక బడ్జెట్ విడుదల
సాక్షి, చైన్నె: గత వారం మాదరి వ్యవసాయ బడ్జెట్‌ను విడుదల చేసిన పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు తాజాగా మాదిరి ఆర్థిక బడ్జెట్‌ను ప్రకటించారు. చైన్నెలోని టీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో దీనిని విడుదల చేశారు. రాష్ట్రంలో రూ.300 గ్యాస్ సబ్సిడీ, 5 కొత్త జిల్లాల ఏర్పాటు, సంపూర్ణ మధ్యపాన నిషేధం వంటి అనేక సంక్షేమ పథకాలు, ఆర్థిక ప్రణాళికలను ఇందులో పొందుపరిచారు.
బడ్జెట్ పరిమాణం – ఆర్థిక అంచనాలు
2026–27 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు రాబడి రూ. 6,71,891 కోట్లుగా అంచనా వేశారు. ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా పన్నుయేతర ఆదాయాన్ని రూ.2,17,945 కోట్లుగా సమకూర్చాలని ప్రతిపాదించారు. మొత్తం వ్యయం రూ. 6,96,149 కోట్లు కాగా, ఇందులో రూ. 50,000 కోట్లను పాత అప్పుల అసలు చెల్లింపులకే కేటాయించి, రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర అప్పుల భారాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమైన హామీలు – సంక్షేమ పథకాలు
● రాబోయే 5 ఏళ్లలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.. మొదటి విడతగా 2026–27 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 6 నెలల్లో లక్ష ఉద్యోగాలు.
● ప్రభుత్వ పాఠశాలలకు 25,000 మంది ఉపాధ్యాయులు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలకు 5,000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–4 కింద 17,000 మంది నియామకం.
● తమిళంలో చదివిన వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు. బోర్డు ప్రకటనలు తమిళంలో లేని దుకాణాలకు రూ.10,000 జరిమానా.
● గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ (ఏడాదికి గరిష్టంగా 6 సిలిండర్లు).
● గృహిణుల ఆర్థిక సాయం రూ.2,000కు పెంపు (రైస్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి).
● గర్భిణులకు ప్రసూతి ఆర్థికసాయం రూ. 25,000కు పెంపు.


