సాక్షి, చైన్నె: తమిళనాడులో మహిళలు, పిల్లల భద్రతను నిర్ధారించడానికి ప్రారంభించిన సింగప్పెన్ గర్జన మార్మోగుతున్నది. ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్యలు చేపడుతున్నది. జూన్ 10న ప్రారంభమైన ఈ టాస్క్ ఫోర్స్ ద్వారా ఇప్పటివరకు 2,000కి పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుని, 187 కేసులు నమోదు చేసినట్లు తమిళనాడు హోం శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మహిళలు, పిల్లలు,బాలికలపై జరుగుతున్న దాడులను కట్టడి చేయడం లక్ష్యంగా సీఎం విజయ్ ఈ టాస్క్ పోర్సును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక విభాగం ఐజీ పర్యవేక్షణలో దూసుకెళ్తున్నది. తమకు సమాచారం అందగానే ఉరకలు తీస్తూ, దూకుడుగా ముందుకు సాగుతున్నది.
ఫిర్యాదులపై తక్షణ పరిష్కారం
గత వారంలో అందిన 346 ఫిర్యాదులపై తక్షణ చర్యలు చేపట్టి, 28 క్రిమినల్ కేసులు ఈటాస్క్ పోర్సు నమోదు చేసింది. అలాగే, తప్పిపోయిన 6 గురు మహిళలు, 14 మంది పిల్లలను సురక్షితంగా రక్షించి వారి కుటుంబాలకు అప్పగించారు. మానసిక వికలాంగులైన 14 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒక బాల్యవివాహాన్ని అడ్డుకోవడంతో పాటు, పాఠశాల విడిచిపెట్టిన 51 మంది పిల్లలు తిరిగి చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,580 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 9,397 సున్నితమైన ప్రాంతాల్లో తీవ్రమైన పెట్రోలింగ్ నిర్వహించారు.
రెండు వారాలలో ఫలితం
జూన్ 10 నుండి జూలై 23 వరకు సాధించిన మొత్తం ఫలితాలు , మొత్తం ఫిర్యాదులు – కేసులుల గురించి అధికారులు వివరించారు.మొత్తం 2,032 ఫిర్యాదులపై చర్యలు తీసుకుని, 187 కేసులు నమోదు చేశారు. తప్పిపోయిన మొత్తం 96 మంది మహిళలు, పిల్లలను కాపాడారు.బాల్యవివాహాల నిరోధం చట్టం మేరకు ఇప్పటివరకు 22 బాల్యవివాహాలను విజయవంతంగా అడ్డుకున్నారు. బడి మానేసిన 169 మంది పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించారు. మానసిక వైకల్యం కలిగిన 57 మందికి పునరావాసం కల్పించారు. నేరాలు జరిగే అవకాశం ఉన్నవిగా గుర్తించిన 58,346 ప్రాంతాల్లో ముమ్మర నిఘా మరియు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ విభాగం మరింత దూకుడుగా ముందుకు సాగి అబలలకు భద్రత పరంగా కవచంగా ఉంటున్నట్టు హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.


