తమిళనాడు పేరిట నిర్వహణ
తిరువళ్లూరు: మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మాజీ అద్యక్షుడు అన్నామలై వియ్ ద లీడర్ పేరుతో నిర్వహించిన మరథాన్ పోటీల్లో వందలాది మంది పాల్గోన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆపార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత వియ్ ద లీడర్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వేర్వేరు కార్యాక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, మత్తు పదార్దాలు లేని రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్డడానికి యువత భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే అన్నామలై మద్దతుదారుల ఆధ్వర్యంలో తిరువళ్లూరులోని డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్థానిక మెడికల్ కళాశాల వరకు ఐదు కిలోమీటర్‌ల మేరకు మారథాన్ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, యువత, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గోన్నారు. పోటీల్లో పాల్గొని విజయం సాధించిన వారితో పాటు అందరికి బహుమతులను నిర్వాహకులు లయన్ పన్నీరుసెల్వం, పాండూరు శేఖర్, పళణి, పెరుమాల్‌తో పాటు పలువురు అందజేశారు. ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికులతోనే గుట్కా, మత్తు పదార్థాలు, మాత్రలు, గంజాయి పెరిగిందన్నారు. తద్వారా ఆసాంఘిక కార్యక్రమాలు సైతం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్‌కు దూరంగా వుండాలని, క్రీడలతో పాటు ఇతర విషయాలపై ఆసక్తిచూపాలని పిలుపు నిచ్చారు.


