స్నాతకోత్సవాల్లో తమిళ్‌ తాయ్‌ వాల్తు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

స్నాతకోత్సవాల్లో తమిళ్‌ తాయ్‌ వాల్తు తప్పనిసరి

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

● టీఎన్‌సీసీ మాణిక్యం ఠాగూర్‌ డిమాండ్‌

సాక్షి, చైన్నె: విద్యా సంస్థల స్నాతకోత్సవాలలో తప్పని సరిగా తమిళ్‌ తాయ్‌ వాల్తు గీతం ఆలపించాల్సిందేనన్న ఉత్తర్వులు జారీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఆదివారం స్పందిస్తూ,. తిరునెల్వేలి మనోన్మణీయం సుందరనార్‌ విశ్వవిద్యాలయ 33వ స్నాతకోత్సవం జూలై 28న జరగనుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్‌ అర్లేకర్‌ హాజరుకానున్నారన్నారు. అయితే రాజ్‌భవన్‌ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మొదట వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం, మూడో స్థానంలో రాష్ట్రగీతం తమిళ్‌ తాయ్‌ వాల్తు ఉన్నట్టు వివరించారు. ఈ సమాచారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీలలో గవర్నర్‌ పాల్గొన్నా సరే తప్పని సరిగా తమిళ్‌ తాయ్‌ వాల్తుకు తొలి ప్రాధాన్యత ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తమిళ్‌ తాయ్‌ వాల్తు గేయాన్ని రచించిన మనోన్మణీయం సుందరనార్‌ పేరిట ఉన్న విశ్వవిద్యాలయంలో ఆయన గీతానికి మూడో స్థానం దక్కుతుండటం వేదన కలిగిస్తుందన్నారు. గవర్నర్లు పాల్గొనే కార్యక్రమాల్లో మొదట వందేమాతరం, ఆపై జాతీయ గీతం, చివరగా రాష్ట్ర గీతం పాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పంపిన ఉత్తర్వుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇందుకు చెక్‌ పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం ప్రారంభంలో మొదట తమిల్‌ తాయ్‌ వాల్తు ఆలపించే సంప్రదాయం ఉందనే విషయాన్ని గుర్తుచేసిన మాణిక్యం ఠాగూర్‌, విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సైతం ఇదే విధానం అనుసరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement