తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో ఆడినెల ఆదివారం సందర్భంగా కావళ్ల సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడినెలలో ఆడికృత్తిక తెప్పోత్సవం వచ్చే నెల 4 నుంచి 8 వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేడుకగా నిర్వహించనున్నారు. ఆడినెల ప్రారంభంతో తిరుత్తణి ఆలయంకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆడినెల ఆదివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. మెట్లు మార్గంతో పాటు, ఘాట్‌రోడ్డులో భక్తజనం కొండ ఆలయంలో పోటెత్తారు. భక్తులు చాలా మంది కావళ్లతో కొండ ఆలయంకు మురుగన్‌భక్తులు పాటలు ఆలపిస్తూ చేరుకున్నారు. సర్వ దర్శన క్యూలైన్ మార్గంలో మూడు గంటలు, రూ. వంద ప్రత్యేక దర్శన మార్గంలో రెండు గంటల పాటు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వేకువజామున మూలవర్లకు పంచామృత అభిషేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి మహా దీపారాధన నిర్వహించారు. రాత్రి వల్లి దేవసేన సమేత ఉత్సవర్లు సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణరథంపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు కనువిందు చేశారు. ఆడినెల ఆదివారం 72 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


