తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన పొన్నుస్వామి(75) ఆదివారం తన పొలం నుంచి పశువులకు గడ్డిని తీసుకొచ్చి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని క్రాస్ చేసే సమయంలో తిరుత్తణి నుంచి చైన్నెకు వేగంగా వెళ్లిన కారు ఢీకొంది. ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు డ్రైవర్ కారును రోడ్డులో విడిచిపెట్టి పరారయ్యాడు. గ్రామీణులు ఆగ్రహంతో రాస్తారోకో చేపట్టారు. దీంతో చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో ట్రాఫిక్ స్తంభించింది. తిరుత్తణి ఏఎస్పీ శుభమ్‌దిమాన్, ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని గ్రామస్తులుతో చర్చలు ఆందోళన విరమింపజేశారు.
తిరువొత్తియూరు: పూందమల్లి సమీపంలోని కుత్తంబాక్కం ప్రాంతంలో బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తులు బస చేసినట్లు క్యూ విభాగానికి చెందిన పోలీసులకు సమాచారం అందింది. దీని ఆధారంగా ఆవడి కార్పొరేషన్ శ్రీక్యూశ్రీ విభాగం పోలీసులు కుత్తంబాక్కం ప్రాంతంలో ముమ్మర సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడి ఒక ఇంట్లో బస చేసి ఉన్న బంగ్లాదేశ్ దేశస్తులైన మహమ్మద్ మున్నా (27), సుల్తానా (40), నర్కేష్ (45), మహమ్మద్ లైసెల్ (30), బాబు (13), రత్న (4) అనే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆ ఆరుగురిని సేలంలోని పునరావాస కేంద్రంలో అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
సాక్షి, చైన్నె: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసంబంధ పాఠ్యపుస్తకాలను అందించే ఆరు దశాబ్దాల సుదీర్ఘ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, రాజస్థాన్ యూత్ అసోసియేషన్ 63వ వార్షిక పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైన్నెలోని వల్లూవర్ కోట్టం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీలంక డిప్యూటీ హైకమిషన్ , వాణిజ్య శాఖ మంత్రి జి.ఎల్. జ్ఞానదేవ ప్రారంభించారు. డి.జి. వైష్ణవ్ కళాశాల కార్యదర్శి అశోక్ కుమార్ ముంధ్రా , మెడ్ కోడ్ సర్వీస్ ఇంక్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ రాజేష్ సురానా గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌వైఏ బుక్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ గౌతమ్‌చంద్ జైన్‌ను సన్మానించారు. రాజస్థాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు వివేక్ బాంబ్ సభలో మాట్లాడుతూ, పుస్తకాల ఖరీదు కారణంగా ఏ అర్హత గల విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే ఒకే ఒక లక్ష్యంతో ది బుక్ బ్యాంక్ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందన్నారు. సభ్యులు, దాతలు, వాలంటీర్ల నిరంతర మద్దతుతో గత 63 సంవత్సరాలుగా 1.60 లక్షల మందికి పైగా విద్యార్థులపై సానుకూల ప్రభావాన్ని చూపగలిగామని. రాబోయే సంవత్సరాలలో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.
తిరువొత్తియూరు: మదురై మేలూరుకు చెందిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే పెరియపుల్లాన్ కుమారుడు ఉలగలాపతి ( 21). ఇతడు చైన్నెలోని ఒక ప్రైవేట్ లా కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఉలగలాపతి వేళచ్చేరిలో ఉంటూ రోజూ మోటార్ సైకిల్‌పై కాలేజీకి వెళ్లి వచ్చేవాడు. గత 22వ తేదీన అతడు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. గాంధీ మండపం ఫ్లైఓవర్ నుండి గిండి వైపు వెళ్తుండగా, సర్దార్ పటేల్ రోడ్డులోని హైవేస్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ సమీపంలో వెనుక నుండి వచ్చిన ఒక జేసీబీ వాహనం ఉలగలాపతి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిపోయిన అతనిపై జేసీబీ వాహనం దూసుకెళ్లడంతో, ఉలగలాపతి ప్రాణాలు కోల్పోయాడు. మైలాపూర్ ఇన్ స్పెక్టర్ భువనేశ్వరి కేసు విచారణ చేపట్టారు.
బాలుడు నడిపినట్లు..
పోలీసుల విచారణలో ఆ జేసీబీ వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ యువకుడు నడిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేశారు. జేసీబీ వాహన యజమాని రాజ్‌కుమార్, ఆ బాలుడు మైనర్ అని తెలిసి కూడా, ఎలాంటి భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ లేని స్థితిలో అతడిని పనిలో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని జైలుకు తరలించారు. 17 ఏళ్ల మైనర్ బాలుడిని కెల్లిస్ లో వున్న ప్రభుత్వ జువైనెల్ హోమ్‌కు చేర్చారు. బాలుడి కుటుంబం చాలా పేదరికంలో ఉండటం వల్లే, అతడు చిన్న వయసు నుంచే జేసీబీ వాహనాన్ని నడుపుతున్నట్లు విచారణలో తెలిసింది


