సాక్షి, చైన్నె: తమిళనాడులోని ఆలయాల్లో కొత్తగా ధ్వజస్తంభం ప్రతిష్టించాలన్నా లేదా పాతదాన్ని తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలన్నా కమిషనర్ నుండి కనీసం 15 రోజుల ముందే ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి చేశారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ టి.జి. వినయ్ అన్ని అన్ని ఆలయాలకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు.
15 రోజుల ముందే దరఖాస్తు
లిస్టెడ్, నాన్–లిస్టెడ్ ఆలయాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని ప్రకటించారు. కొత్త ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు కనీసం 15 రోజుల ముందు కమిషనర్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటూ ఆలయ కార్యనిర్వహణ అధికారి లేదా ధర్మకర్తల తీర్మానం ప్రతి, ప్రాంతీయ స్థపతి అభిప్రాయం, డ్రాయింగ్ కమిటీ సిఫార్సు, ఆలయ అర్చకుల లేఖ, ముహూర్తం పత్రిక, కొత్త ధ్వజస్తంభం రంగు ఫోటో , పాత ధ్వజస్తంభాన్ని తొలగించేందుకు పొందిన అనుమతి పత్రం కాపీలను జతచేయాలని పేర్కొన్నారు.
దాతల విరాళాలు – కవచాల అమరిక
దాతల ద్వారా ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తుంటే, వారి సమ్మతి లేఖతో పాటు ఆర్థిక ఆధారాల ధృవీకరణ పత్రాలను అందించాలని తెలిపారు. అలాగే ధ్వజస్తంభానికి బంగారం, వెండి లేదా రాగి కవచాలు అమర్చాలనుకుంటే దానికి విడిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని వివరించారు. ఇప్పటివరకు ధ్వజస్తంభం లేని ఆలయాల్లో మొదటిసారి ప్రతిష్ఠిస్తుంటే, ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీ తీర్మానంతో పాటు ఆగమ పండితుల (శివాచార్య/ భట్టాచార్య) సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి చేశారు. ధ్వజస్తంభ ఏర్పాటు ప్రక్రియ అంతా పూర్తిగా ఆగమ శాస్త్రాల ప్రకారమే జరగాలని, ప్రాంతీయ సహాయ లేదా డిప్యూటీ కమిషనర్ సమక్షంలో, స్థపతి, ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సిబ్బంది భద్రతను నిర్ధారిస్తూ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
వీడియో రికార్డింగ్ –
పురాతన వస్తువుల భద్రత
పాత ధ్వజస్తంభం కింద ఏదైనా విలువైన వస్తువులు లభిస్తే, వాటి వివరాలను రికార్డు చేసి తిరిగి కొత్త ధ్వజస్తంభం కిందనే నిక్షిప్తం చేయాలని, పనుల ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతి ఘట్టాన్ని ఫోటోలు, వీడియోలు తీసి ఆలయ రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను వీడియో ఆధారాలతో సహా కమిషనర్‌కు సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొనడం గమనార్హం.


