ఐడీఎఫ్‌సీ ఫలితాలలో రికార్డు | - | Sakshi
Sakshi News home page

ఐడీఎఫ్‌సీ ఫలితాలలో రికార్డు

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

ఐడీఎఫ్‌సీ ఫలితాలలో రికార్డు రూ.78 లక్షల వ్యయంతో ఏసీ బస్‌ షెల్టర్‌ ● కార్పొరేషన్‌ కొత్త ప్రాజెక్ట్‌ యూనిటీ రన్‌కు స్పందన

సాక్షి, చైన్నె: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ 1ఎఫ్‌వై 27 రికార్డు ఫలితాలను ఆ సంస్థ ఎండీ వి.వైద్యనాథన్‌ ఆదివారం స్థానికంగా ప్రకటించారు. ఈ మేరకు రూ. 1,075 కోట్ల నికర లాభంతో ఏటా 132.4% వృద్ధిని సాధించినట్టు వివరించారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదుచేసిన రూ.463 కోట్లతో పోలిస్తే ఇది 132.4% భారీ వృద్ధిని నమోదు చేసిందన్నారు. బ్యాంక్‌ మొత్తం కస్టమర్‌ బిజినెస్‌ రుణాలు, డిపాజిట్లు ఏటా 18.6% పెరిగి రూ. 6,04,776 కోట్లకు చేరిందన్నారు. మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఇది 5.2% వృద్ధి సాధించిందని వివరించారు. మొత్తం రుణాలు ఏటా 20.6% పెరిగి రూ.3,05,370 కోట్లకు చేరాయని, మోర్ట్‌గేజ్‌, వాహన, కార్పొరేట్‌ , కన్స్యూమర్‌ లోన్స్‌ విభాగాల్లో బలమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. రిటైల్‌, అగ్రి , ఎంఎస్‌ఎంఈ రుణాలు ఏటా 18.2% పెరిగి రూ.2,41,118 కోట్లకు చేరాయని ప్రకటించారు. రాబోయే రోజుల్లో వర్షపాతం, ఇంధన ధరల వ్యత్యాసాల వంటి భౌగోళిక–రాజకీయ లేదా స్థూల ఆర్థిక అనిశ్చితులను తట్టుకోవడానికి ముందుజాగ్రత్తగా రూ.515 కోట్ల ప్రోవిజన్‌ ఏర్పాటు చేశామ న్నారు. బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తి 15.05% గాను, సీఈటీ–1 నిష్పత్తి 13.33% గాను బలంగా ఉందన్నారు. ఉన్నతమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలతో అత్యుత్తమ బ్యాంకింగ్‌ సంస్థను నిర్మించడమే తమ లక్ష్యంగా వ్యాఖ్యానించారు.

కొరుక్కుపేట: మెరీనా బీచ్‌ వైపున, కామరాజర్‌ రోడ్డులోని బస్టాండ్‌ సమీపంలో ఉన్న అన్నా స్క్వేర్‌ వద్ద, రూ. 78 లక్షల వ్యయంతో పూర్తి ఏసీ సౌకర్యాలు గల బస్‌ షెల్టర్‌ను నిర్మించాలని చైన్నె కార్పొరేషన్‌ యోచిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం కార్పొరేషన్‌ బిడ్లను ఆహ్వానించింది. ఈ విషయమై కల్పించనున్న సౌకర్యాల గురించి కార్పొరేషన్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆశ్రయం సజావుగా పనిచేసేలా చూసేందుకు, ఇందులో సీసీటీవీ కెమెరాలు, వై–ఫై సౌకర్యం, మొబైల్‌ ఛార్జింగ్‌ సౌకర్యం, ఎల్‌ఈడీ లైట్లు , పురుషులకు, మహిళలకు వేర్వేరు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, యూవీ ట్రీట్‌మెంట్‌ సౌకర్యంతో కూడిన 3,000 లీటర్ల సామర్థ్యం కలిగిన బయోసెప్టిక్‌ ట్యాంక్‌, 14 కిలో లీటర్ల సామర్థ్యం గల భూగర్భ జల నిల్వ ట్యాంక్‌, ఓ ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

కొరుక్కుపేట: వరల్డ్‌ ఉమెన్స్‌ ఫౌండేషన్‌ 2000 ఆధ్వర్యంలో యూనిటీ రన్‌ మారథాన్‌ 2026ను చైన్నెలోని ఐలాండ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు డాక్టర్‌ సత్య రమేష్‌ నేతత్వంలో నిర్వహించిన యూనిటీ రన్‌ను తమిళనాడు మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ సి.ఎం.కె.రెడ్డి, ఎతిరాజ్‌ కళాశాల ఛైర్మన్‌ వి.ఎం.మురళీధరన్‌ జెండా ఊపి ప్రారంభించారు. విద్యపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం రన్‌ విజేతలకు జ్ఞాపికలు, పతకాలు అందజేశారు. ఏఐటీఎఫ్‌ కార్యదర్శి ఎస్‌. గజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement