సాక్షి, చైన్నె: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పుదుచ్చేరి బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద అధికారికంగా నివాళులర్పించే కార్యక్రమంలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమిలోని అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ మంత్రులు, నేతలు విడిగా వచ్చి అమరవీరులకు నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది. పుదుచ్చేరి బీచ్ రోడ్డులోని స్మారక స్థూపం వద్ద నిర్వహించిన అధికారిక వేడుకలో లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్, ముఖ్యమంత్రి రంగస్వామి, అసెంబ్లీ స్పీకర్ అన్బళగన్, మంత్రులు రాజవేలు, శివకొళుందు మరియు ఎమ్మెల్యేలు హాజరై పుష్పగుచ్ఛాలు ఉంచి సైనికులకు నివాళులర్పించారు.
కూటమిలో విభేదాలు – బీజేపీ దూరం
పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్‌ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి ప్రభుత్వం నడుస్తున్నది. అయితే, గతంలో ఇచ్చిన మంత్రి పదవుల కేటాయింపుపై ముఖ్యమంత్రి రంగస్వామి సానుకూలంగా స్పందించకపోవడంతో బీజేపీ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. సీఎం రంగస్వామి పంపిన పలు ఫైళ్లకు లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్ కూడా ఆమోదం తెలపడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నారు.
విడిగా వచ్చి నివాళులు
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం పూర్తయిన తర్వాత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం నాయకత్వంలో రాష్ట్ర మంత్రి నమశ్శివాయం, మాజీ స్పీకర్ సెల్వం తదితర బీజేపీ నాయకులు విడిగా వచ్చి వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.


