సాక్షి, చైన్నె: తమిళనాడులో లాకప్ (కస్టడీ) మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఎప్పుడు తన మౌనాన్ని వీడతారని డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ ఘాటుగా ప్రశ్నించారు. నాగర్‌కోయిల్ జైలులో శబరివర్మన్ అనే విచారణ ఖైదీ కొట్టి చంపిన వివాదం సద్దుమనగక ముందే, తూత్తుకుడిలో అరుణాచలం అనే విచారణ ఖైదీ పోలీస్ స్టేషన్‌లోనే దెబ్బలకు బలికావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వరుస ఘటనలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో శనివారం స్పందిస్తూ ...‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నన్ను చూసి ’సారీ చెబితే సరిపోతుందా?’’ అని ఉద్రేకంతో ప్రశ్నించిన మహానుభావుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సారీ కూడా చెప్పే ధైర్యం లేక ఎక్కడ దాక్కున్నారు?’’ అని ఎద్దేవా చేశారు. బాధ్యత, క్షమాపణ అనే పదాలు సీఎం నిఘంటువులోనే లేవా?, మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే కనీస మానవత్వం కూడా లేని ఈ నిర్దయ టీవీకే ప్రభుత్వం తీరుకు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
ఇతర రాజకీయ నేతల ఖండన
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ లాకప్ డెత్‌లపై స్పందిస్తూ, కన్యాకుమారి జిల్లాలో ఒక దివ్యాంగుడిని పోలీసులు కొట్టి చంపారన్న వార్తల నుంచి తేరుకోకముందే, తూత్తుకుడిలో అరుణాచలం అనే యువకుడు కస్టడీలో మరణించడం దారుణంగా పేర్కొన్నారు. శాతాన్‌కుళం ఘటన తర్వాత కూడా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని ఇది నిరూపిస్తుదన్నదన్నారు. కస్టడీ మరణాలను పూర్తిగా అరికట్టేలా పోలీసు శాఖను సీఎం ప్రక్షాళన చేయాలన్నారు. ఇక, నామ్ తమిళర్ కట్చి సీమాన్ స్పందిస్తూ, మూడు నెలల పాలన కూడా పూర్తికాకముందే టీవీకే ప్రభుత్వంలో 4 కస్టడీ మరణాలు జరగడం పాలనా విఫలత్వానికి అద్దం పడుతోందన్నారు. ఎంతటి నేరస్తుడికై నా శిక్ష పడాల్సింది కోర్టుల ద్వారానే కానీ, పోలీసుల దౌర్జన్యాల ద్వారా కాదు. అరుణాచలం మృతిని హత్య కేసుగా నమోదు చేసి బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక కుట్రల వలలో చిక్కుకోవద్దు
కావేరీ నదీ జలాల వివాదంపై కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయంపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తమిళనాడు చట్టబద్ధమైన హక్కులను దెబ్బతీసేందుకు కర్ణాటక పన్నిన కుట్రల వలలో పడకూడదని, వెంటనే ఈ చర్చల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫలించని చర్చల చరిత్ర
తమిళనాడు కర్ణాటక మధ్య కావేరి జల వివాదం గురించి తెలిసిందేనని గుర్తు చేస్తూ, 1960ల నుండి 1990 వరకు కావేరీ జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య 50కి పైగా దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి పరిష్కారమూ లభించలేదని వివరించారు. అందుకే దివంగత మాజీ సీఎం ఎం.కరుణానిధి హయాంలో సుప్రీంకోర్టును ఆశ్రయించి, కావేరీ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయించామని స్టాలిన్ గుర్తుచేశారు. కావేరీ నదిపై మేఘదాతు వద్ద కర్ణాటక ఆనకట్ట నిర్మించాలనే ప్రయత్నం తమిళనాడు రైతుల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్ధమన్నారు.గతంలో కర్ణాటక సీఎం యడియూరప్ప తనను చర్చలకు పిలిచినప్పుడు,చర్చలకు తావులేదని స్పష్టంగా తిరస్కరించామన్నారు.
రైతుల ఆగ్రహం
కర్ణాటక ముఖ్యమంత్రితో చర్చలకు తమిళనాడు సీఎం విజయ్ వెళ్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించడంపై కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కావేరీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఏర్పా టు కాగా, మళ్లీ చర్చలకు వెళ్లడం అనేది తమిళనాడు గత 30 ఏళ్లుగా చేసిన న్యాయపోరాటాన్ని నీరుగార్చడమేనని విమర్శించారు. ముందుగా స్టాలిన్ రైతు సంఘాల నేతలతో సంప్రదింపు జరిపారు. కాగా, ఆగస్టు 3న కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సీఎం విజయ్ భేటి కానున్నారని వ్యవసాయ మంత్రి వినోద్ ప్రకటించిన విషయం తెలిసిందే.


