కొరుక్కుపేట: విద్యార్థి దశ నుంచే సంప్రదాయ గ్రంథాలు, చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకోవాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్) చైన్నె అధ్యక్షులు పి.రవీంద్రకుమార్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనా లతో వార్షిక అంతర్ పాఠశాలల శ్లోకాల–2026 రెండ్రోజుల పోటీలను శనివారం ఆరంభం అయ్యాయి. చైన్నె అశోకనగర్లో ఉన్న జీఆర్టీ మహాలక్ష్మి విద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. తొలిరోజు రామాయణం బాలకాండలోని తాటకీ సంహారం, రామశివధనుర్భంగం ఘట్టాలపై నిర్వహించిన చిత్రలేఖనం, ఆలవందార్ స్త్రోత్రం, నాలాయర దివ్యప్రబంధం, రామానుజ నూట్రాండి, శ్రీ విష్ణుసహస్రనామంపై అవదానం పోటీల్లో 1200 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. శ్రీసిటీ, వైవీఎస్ గోపురం కంపెనీ, నాయుడు హాల్, వివిధ వైశ్య ధర్మ సంస్థల సహకారంతో పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, విద్యా సామగ్రిని రవీంద్రకుమార్‌రెడ్డి అందజేసి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జెట్ చైన్నె ఆధ్వర్యంలో, 32వ వార్షిక రెండ్రోజుల పోటీల్లో పాల్గొనేందుకు నగరం లోని పలు పాఠశాలల్లోని సుమారు 1,300 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. వీరికి ఆధ్యాత్మిక గ్రంథాల్లోని సారాంశాన్ని నేర్పుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో నిర్విరామంగా ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక పోటీల ద్వారా విద్యార్థుల్లో భక్తిభావాన్ని పెంపొందింపజేస్తున్నామన్నారు. ఏర్పాట్లను జెట్ చైన్నె నిర్వాహక కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించి పాల్గొన్న విద్యార్థులు, గురువులు తల్లిదండ్ర లకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.


