సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయమైన చారిత్రాత్మక సత్యమూర్తి భవన్‌లో వాస్తు ప్రకారం మార్పులు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కామరాజ్, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అనేక మంది అగ్ర నాయకులు సందర్శించిన ఈ చారిత్రాత్మక భవనంలో, కొత్త నాయకత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాతి మార్పులు చేపట్టడం పరిపాటిగా వస్తున్నది. చైన్నె రాయపేటలోని ఈ భవనంలో తాజాగా వాస్తు మార్పులు సాగుతుండటం గమనార్హం. ఇటీవల మాణిక్యం ఠాకూర్ అధ్యక్ష బాధ్యలు స్వీకరించారు. కర్మయోగి కామరాజర్ పాలన త్వరలో తమిళనాట వస్తుందని ప్రకటించారు. అదే సమయంలో తాజాగా టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగమైంది. ఐదుదశాబ్దాల అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులయ్యారు. ఈ పరిస్థితులలో తాజాగా పార్టీ నాయకత్వంలో బాధ్యతలు చేతులు మారిన నేపథ్యంలో, పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక వాస్తు నిపుణుడు సత్యమూర్తి భవనాన్ని పరిశీలించి ఉన్నారు. నిపుణుల సలహా ప్రకారం నాయకుడు లేదా అధ్యక్షుడి గది నైరుతి దిశలో ఉండాలని సూచించినట్టు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న అమరికలలో కొన్ని వాస్తు దోషాలు ఉన్నట్లు ఆయన గుర్తించి ఉండటం గమనార్హం. రాబోయే కాలంలో పార్టీకి మంచి సువర్ణావకాశాలు ఉన్నందున, వాస్తు పరమైన అడ్డంకులు ఏవీ ఉండకూడదని భావించి, అధ్యక్షుడు గదిని భవనం రెండవ అంతస్తుకు (నైరుతి దిశ) తరలించాలని నిర్ణయించారు. ఈ మార్పుల ఆధారంగా భవన పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


