సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ ఇంకా తేలకపోవడంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యమంత్రి రంగస్వామి సమర్పించిన మంత్రుల పోర్ట్‌ఫోలియో (శాఖల) జాబితాకు లెఫ్టినెంట్ గవర్నర్ కై లాష్‌నాథన్ ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తుండడంతో బడ్జెట్ సమర్పణపై సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి రంగస్వామి ఈనెల 20న మంత్రుల శాఖల కేటాయింపు జాబితాను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందజేశారు. సాధారణంగా వెంటనే ఆమోదం లభించాల్సి ఉండగా, నాలుగు రోజులు గడిచినా గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా లేదు. గతంలో బీజేపీకి కేటాయించిన కొన్ని కీలక మంత్రి పదవులను ఈసారి వారికి ఇవ్వకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై బీజేపీ సైతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు దాటినా, ఇంత వరకు శాఖల కేటాయింపు జరగకపోవడం గమనార్హం.
చిక్కుల్లో రూ.14,500 కోట్ల బడ్జెట్
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ.14,500 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. శాఖల కేటాయింపు పూర్తయి, కొత్త అసెంబ్లీ కొలువుదీరితే తప్ప బడ్జెట్‌ను ఆమోదించే వీలులేకపోవడంతో సీఎం రంగస్వామి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిణామాలు పుదుచ్చేరి రాజకీయాలను ఉత్కంఠలో పడేశాయి.


