పొంచి ఉన్న జలగండం | - | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న జలగండం

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

● వానల్లేవు.. నీళ్లు లేవు ● తమిళనాడుపై కరువు కోరలు ● అడుగంటిన జలాశయాలు

న్యూస్‌రీల్‌

జూలై ముగుస్తున్నా వరుణుడు కరుణించలేదు. రుతుపవనాల జాడ లేదు. తమిళనాట ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ చుక్క నీటిబొట్టు బంగారమవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన డ్యామ్‌లు మేట్టూరు, వైగై, భవానిసాగర్‌ తదితరాలు ఖాళీ అవుతున్నాయి. నీటి విడుదల ఆగిపోవడంతో డెల్లా జిల్లాల్లో కురవై సాగు ప్రశ్నార్థకంగా మారింది. రాబోవు రోజుల్లో వర్షాలు కురవకపోతే సాగునీటి సంగతి దేవుడెరుగు మైళ్లకొద్దీ నడిచినా బొట్టు నీరు దొరకని తాగునీటి గండం నెలకొనే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి, చైన్నె : రుతుపవనాల విఫలం, ఎల్‌నినో ప్రభావంతో తమిళనాడు తీవ్రమైన నీటి సంక్షోభంలోకి కూరుకుపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యామ్‌లు, జలాశయాల్లో నీటి మట్టాలు వేగంగా పడిపోతుండడంతో వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా, తాగునీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళన తీవ్రమవుతోంది. రాష్ట్రంలోని 90 ప్రధాన జలాశయాల్లోని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 224.3 టీఎంసీలు. ప్రస్తుతం 31 శాతం (71.2 టీఎంసీలు) నీరు మాత్రమే ఉంది. 52 జలాశయాల్లో నీటిమట్టం 25 శాతం కంటే తక్కువకు పడిపోయింది. 17 డ్యామ్‌లలో 26–50 శాతం, 12 డ్యామ్‌లలో 51–75 శాతం నిల్వలు ఉండగా, 6 డ్యామ్‌లు మాత్రమే పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. డెల్టా జిల్లాల్లో కావేరి జలాలు కరువవడంతో రైతులు బోరు బావుల్ని నమ్ముకుని కొంత మేరకు సాగు చేస్తున్నా, పంట చేతికి వచ్చేది అనుమానంగా ఉంది. ఇక రాజధాని నగరం చైన్నెకి నీరు అందించే 5 ప్రధాన జలాశయాల్లో ప్రస్తుతం 44 శాతం (5.84 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ఏడాది నైరుతి పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ఈశాన్య రుతుపవనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పవనాలు కూడా అనుకూలించకపోతే చైన్నెకి తాగునీటి ముప్పు తప్పదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

తక్షణ చర్యలు అవసరం

వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం తక్షణమే సమర్థవంతమైన నీటి నిర్వహణ చర్యలు చేపట్టాలని, భూగర్భ జలాలను పెంపొందించేందుకు చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిపుణులు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేస్తే తమిళనాడు కరువు కోరల్లో చిక్కడం ఖాయమన్న ఆందోళనలు తప్పడం లేదు. 2027 వేసవిలో నీటి ఎద్దడి తీవ్ర తాండవం చేస్తుందేమోనన్న బెంగ ప్రజల్లో బయలుదేరింది. ఇప్పటికే చైన్నెకి నీరు అందించే రిజర్వాయర్లు ఎండిపోయే పరిస్థితులు ఉండడం, కడలూరు జిల్లా వీరానం రిజర్వాయర్‌ నుంచి నీటి పంపిణీ ఆగిపోవడం కలవరాన్ని రేపుతోంది.

సమావేశంలో పళణి స్వామి తదితర నేతలు

సాక్షి, చైన్నె : ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వివిధ జిల్లాల నిర్వాహకులతో నిర్వహిస్తున్న సంప్రదింపుల సమావేశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పార్టీ అంతర్గత విభేదాల కారణంగా పలువురు సీనియర్‌ నాయకులు ఈ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా జరిగిన కోయంబత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి హాజరుకాలేదు. ఇది కాస్త పార్టీ వర్గాలలో చర్చకు దారి తీసింది. అలాగే, విల్లుపురం జిల్లా భేటీకి సీనియర్‌ నేత సీవీ షణ్ముగం సైతం రాలేదు. ఈ ఇద్దరు నేతలు సీఎం విజయ్‌ విశ్వాస పరీక్ష సమయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు, పదవుల కేటాయింపులపై అసంతృప్తితోనే వీరు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం విల్లుపురం, తిరువారూర్‌, సేలం జిల్లాల ప్రతినిధులతో చర్చలు ముగించారు. శనివారం చైన్నె, తిరువళ్లూరు సౌత్‌ జిల్లాల నిర్వాహకులతో పళనిస్వామి సమావేశం కానున్నారు. ఈ భేటీకి ఎంతమంది నేతలు దూరం కానున్నారో వేచి చూడాల్సిందే. ఇది వరకు జరిగిన వివిధ జిల్లాల సమావేశానికి అనేక మంది మాజీ మంత్రులు, ముఖ్య నేతలు దూరంగా ఉండడంతో మున్ముందు అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో అన్న చర్చ ఊపందుకుంది.

వివిధ జిల్లాల్లో కరువు చాయలు

71 అడుగుల సామర్థ్యం ఉన్న వైగై డ్యామ్‌లో నీరు అడుగంటింది. దీంతో నత్తలు, ముత్యపు చిప్పలు చనిపోయి గుట్టలుగా పడి ఉన్న దృశ్యాలు అక్కడి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ నీటిపై ఆధార పడ్డ తేని, విరుదునగర్‌, మదురై, రామనాథపురం, శివగంగై జిల్లాలో సాగు, తాగునీరు కరువయ్యే పరిస్థితి నెలకొంది.

105 అడుగుల లోతు ఉన్న ఈరోడ్‌ భవానీసాగర్‌ డ్యామ్‌ నీటిమట్టం 57.10 అడుగులకు పడిపోయింది. నీటి ప్రవాహం తగ్గడంతో ఈ జలాశయం మీద ఆధార పడిన 2.47 లక్షల హెక్టార్ల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రభావం రైతుల్ని కలవరంలోకి నెట్టినట్టింది.

13 జిల్లాల్లోని 16 లక్షల ఎకరాలకు ఆధారమైన సేలం జిల్లా మేట్టూరు డ్యామ్‌కు కర్ణాటక నుంచి కావేరి నీరు విడుదల కాలేదు. దీంతో తూర్పు–పశ్చిమ కాలువల ద్వారా నీరు రాకపోవడంతో పరిసరాల్లోని 100కు పైగా చెరువులు ఎండిపోయాయి.

నీలగిరి జిల్లాలో ఒకప్పుడు జలపాతాలు, భారీ వర్షాలతో అలరిస్తూ రెండో చిరపుంజిగా పేరుగాంచిన దేవవిల్‌ ప్రాంతం సహా ఊటీ, కూనూర్లలో తీవ్రమైన ఎండలు, నీటి కొరత నెలకొంది. పాండియార్‌–పున్నంబుళా నదుల్లో ప్రవాహం తగ్గి, కాఫీ, టీ, మిరియాల తోటల సాగు దెబ్బతింటోంది.

తిరునల్వేలి జిల్లాలోని 143 అడుగుల పాపనాశం డ్యామ్‌ నీటిమట్టం 67 అడుగులకు పడిపోగా, మణిముత్తారు, పేచ్చిపారై, గుండారు, సాత్తనూరు తదితర రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోయింది. జిల్లాలోని 103 చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. తూత్తుకుడి జిల్లాలోని 91 చెరువుల్లో దాదాపు అన్నీ ఎండిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement