సాక్షి, చైన్నె : తమిళనాడులో నీట్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమయ్యాయి. విద్యార్థులు ఎక్కడికక్కడ పోరుబాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్షలకు పూనుకున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా, నీట్ రద్దుకు పట్టుబడుతూ తమిళనాట మూడో రోజు శుక్రవారం కూడా ధర్నాలు, నిరసనలు కొనసాగాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్, న్యాయ కళాశాలల విద్యార్థులు తరగతులను బహిష్కరించి ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. రాష్ట్రంలోని చైన్నె, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి వంటి నగరాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరి నిరసనలను హోరెత్తించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలో నీట్ పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ, నీట్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి లోకం సమర శంఖం పూరించింది.
నిరసనల హోరు
ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ సంయుక్తంగా చైన్నె ఎగ్మోర్‌లోని రాజరత్నం స్టేడియం సమీపంలో భారీ నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ఈ ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబూని తమ నిరసనను వ్యక్తం చేయడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చైన్నె నుంగంబాక్కంలోని లయోల కళాశాల విద్యార్థులు, రాజధాని కళాశాల విద్యార్థులు సైతం పోరుబాట పట్టారు. కడలూరు, చిదంబరంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. చిదంబరం అన్నామలై విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా, రహదారి దిగ్బంధం చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అలాగే కడలూరు జవాన్స్ భవన్ వద్ద సీఐటీయూ, రైతు సంఘాలు, మహిళా సంఘాల కూటమి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరగ్గా, వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన పోస్టాఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. తంజావూరు, నాగపట్నంలోనూ విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉలుందూరు పేటలో డీఎంకే యువజన విభాగం పోరు ఉత్కంఠను రేపింది. డీఎంకే విద్యార్థి, యువజన విభాగాలు సైతం పోరుబాటకు సిద్ధంకావడంతో మున్ముందు నిరసనలు మరింతగా హోరెత్తే అవకాశాలు ఉన్నాయి.
వ్యక్తిగత విమర్శలు వద్దు
నిరసన సందర్భంగా రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని విద్యార్థి లోకానికి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో విద్యార్థులను అణచి వేసే విధంగా పోలీసులు అరెస్టులు చేయడాన్ని సీపీఎం కార్యదర్శి షణ్ముగం తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో తాము పునరాలోచించాల్సి ఉంటుందని పరోక్షంగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న విషయంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా శనివారం టీఎన్‌సీసీ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్, రాష్ట్ర మంత్రి ఎన్ ఆనంద్ నేతృత్వంలో సభకు ఏర్పాట్లు చేశారు. నీట్‌కు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు సైతం గళాన్ని వినిపిస్తున్నారు. దర్శకులు అమీర్, పా రంజిత్, వెట్రి మారన్, నటుడు సత్యరాజ్, నటి రేవతి తదితరులు నీట్‌కు వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులను, అరెస్టులను ఖండించడమే కాకుండా నిరసనలో భాగమయ్యారు.
చైన్నె కళాశాలలో నిరసన


