● పర్యాటక రంగంలో తిరుచ్చి సరికొత్త రికార్డు
సాక్షి, చైన్నె : తమిళనాడు పర్యాటక రంగంలో తిరుచ్చి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించి రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. తమిళనాడులో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు కొదవ లేదు. ఇందులోనూ కొన్ని పర్యాటక కేంద్రాలు, మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు నిత్యం ప్రజలతో రద్దీతో ఉంటాయి. ఆ దిశగా గత ఏడాది తమిళనాడును సందర్శించిన మొత్తం పర్యాటకుల సంఖ్యలో తిరుచ్చి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని పర్యాటక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, తిరుచ్చి మలైకోటై (రాక్ ఫోర్ట్) పిళ్లయార్ ఆలయం, సమయపురం మారియమ్మన్ ఆలయం, జంబుకేశ్వరర్ ఆలయంతో పాటు సమీపంలోని ముక్కొంబు వంటి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రాంతాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు తరలివచ్చినట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, భద్రతా చర్యలు చేపట్టడం, రవాణా సౌకర్యాలను సులభతరం చేయ డమే తిరుచ్చి జిల్లా ఈ ఘనత సాధించడానికి ప్రధాన కారణమని తెలిపారు. పర్యాటకంగా ప్రసిద్ది చెందిన ఊటీ, కొడైకెనాల్, కన్యాకుమారి వంటి ప్రదేశాలను ఈ సారి వెనక్కు నెట్టి తిరుచ్చి మొదటి స్థానంలో నిలవడం విశేషం.
ఆగస్టులో కొత్త పార్టీ!
సాక్షి, చైన్నె : తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తనకొత్త రాజకీయ ప్రయాణానికి సంబంధించిన కీలక కసరత్తు చేపట్టారు. ఆగస్టులో తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం వెలువడింది. అంతలోపు వీ ది లీడర్స్ ఆధ్వర్యంలో విస్తృతంగా సభ్యత్వ నమోదుకు సిద్ధమయ్యారు. అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ ది లీడర్స్ పేరిట సామాజిక–రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తమిళనాడు వ్యాప్తంగా లక్షలాది మంది మద్దతుదారులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వీ ది లీడర్స్ బృందం సభ్యులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తున్నారు. యువత, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులను కలుపుకుని అవినీతి రహిత పాలన, కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే లక్ష్యంగా కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు సమాచారం. ఆగస్టు నెలలో జరగబోయే భారీ బహిరంగ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించి, రాబోయే రాజకీయ కార్యాచరణను అన్నామలై ప్రకటించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అన్నామలై మేధావులు, నిపుణులు, రాజకీయ విశ్లేషకులతో కలిసి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
‘జననాయకన్’ చూస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది
తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ వ్యాఖ్య
సాక్షి, చైన్నె : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమి ళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


