రియల్‌ హీరోగా మారండి! | - | Sakshi
Sakshi News home page

రియల్‌ హీరోగా మారండి!

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

● ప్రేమలత విజయకాంత్‌

సాక్షి, చైన్నె : తమిళనాడులో లాకప్‌ డెత్‌లు జరుగుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, కరెంట్‌ ఛార్జీల బాదుడు కొనసాగుతోందని డీఎండీకే ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్‌ విమర్శించారు. ఆమె శుక్రవారం కడలూరులో విలేకరులతో మాట్లాడారు. ‘ఇది సినిమా కాదు.. రీల్‌ హీరో కాస్తా రియల్‌ హీరో కావాలంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి’ అని సీఎం విజయ్‌కు హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వం తీరు, పనితీరుపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు. తాము నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నామని, అధికారులతో మాట్లాడుతున్నామని వివరించారు. ఇంతవరకు ఎక్కడా ఒక్క టెండర్‌ వేయలేదని, అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇది సీన్‌ క్రియేట్‌ చేయడానికి, ఫొటో షూట్‌లు దిగడానికి, రీల్స్‌ చేయడానికి సినిమా కాదని, కోట్లాది మంది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్యగా ముఖ్యమంత్రి విజయ్‌ గుర్తించాలని పేర్కొన్నారు. టీవీకే ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు.

విపరీతంగా పెరిగిన ధరలు

మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయని, నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలని ప్రేమలత విజయకాంత్‌ డిమాండ్‌ చేశారు. థియేటర్లలో కూర్చుని సినిమాలు చూసి ఏడవడం, డ్రామాలు ఆడటం కాదని, ప్రజల బతుకుదెరువు సమస్యలు, ఎల్‌నినో ప్రభావంతో తమిళనాడు కరువు వైపు వెళ్తోందన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని పేర్కొన్నారు. కరువు, నిత్యావసరాల ధరల భారం నుంచి ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాపాడాలన్నారు.

పెరిగిన లాకప్‌ డెత్‌ల సంఖ్య

నెలల వ్యవధిలో తమిళనాడులో లాకప్‌ డెత్‌ల సంఖ్య పెరగడం ఆందోళనను కలిగిస్తోందన్నారు. తూత్తుక్కుడిలో మళ్లీ జరిగిన లాకప్‌ డెత్‌పై స్పందిస్తూ ఎవరినీ కొట్టి చంపే హక్కు పోలీసులకు ఏ చట్టమూ ఇవ్వలేదన్నారు. అనుమానితులను స్టేషన్‌కు తీసుకెళ్తే విచారించి కోర్టులో ప్రవేశపెట్టాలని, తప్పు ఉంటే న్యాయస్థానమే శిక్ష విధిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి లాకప్‌ డెత్‌లు పునరావృతం కాకూడదని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు పెరిగిపోయాయని, కరెంట్‌ ఛార్జీల భారం తీవ్రమైందని ఆరోపించారు. పాలనలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదని, కంటి తుడుపు చర్యలే మళ్లీ జరుగుతున్నాయని విమర్శించారు. రీల్‌ హీరోగా ఉన్నవారు రియల్‌ హీరో అనిపించుకోవాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరాలని ప్రేమలత స్పష్టం చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement