సాక్షి, చైన్నె : చైన్నె కామరాజర్ మార్గంలోని తమిళనాడు సచివాలయం (సెక్రటేరియట్) నిర్వర్తిస్తున్న చారిత్రక సెయింట్ జార్జ్ కోట ప్రాంగణంలో ప్రస్తుతం తీవ్ర స్థలాభావం ఏర్పడింది. దీంతో సచివాలయాన్ని వేరే ప్రాంతానికి తరలించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సెయింట్ జార్జ్ కోట పురాతన భవనం. ఇక్కడే సచివాలయం, అసెంబ్లీ సమావేశ మందిరం ఉన్నాయి. ఈ భవనంలో మంత్రులు, అధికారుల కార్యాలయాలకు సరిపడా స్థలం లేదు. శాసనసభ భవనం, ఎమ్మెల్యేల గదులు కూడా చిన్నవిగా ఉండడం పెద్ద సమస్యగా మారింది. పక్కనే నామక్కల్ కవిజ్ఞర్ మాళిగై 10 అంతస్తుల భవనం ఉంది. దీన్ని ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయానికి అనుగుణంగా మార్పులు చేస్తున్నప్పటికీ, భవనం మొత్తంలో స్థలాభావం నెలకొందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ఆది నుంచి సమస్యే
సచివాలయంలో స్థలం కొరత ఆది నుంచి ఉంది. 2006లో అప్పటి సీఎం కరుణానిధి ఓమండూరార్ కాంప్లెక్స్‌లో కొత్త సచివాలయాన్ని, బ్రహ్మాండ అసెంబ్లీ భవనాన్ని వందల కోట్లతో నిర్మించారు. ఇది కరుణానిధి కళల సౌధంగా మారింది. 2010లో దీనిని ఉపయోగంలోకి తీసుకొచ్చారు. 2011లో జయలలిత అధికారంలోకి వచ్చాక దాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి, సచివాలయ కార్యకలాపాలను తిరిగి సెయింట్ జార్జ్ కోటకే తరలించారు. ప్రస్తుతం కొత్తగా టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సీఎం విజయ్ సచివాలయ తరలింపు ప్రతిపాదనలపై అధికారులతో చర్చిస్తుండడం గమనార్హం.
డిఫెన్స్ స్థలంపై దృష్టి
చైన్నెలోని సెయింట్ జార్జ్ కోటలోని ప్రస్తుతం ఉన్న భవనాల్లో వివిధ ప్రభుత్వ శాఖల విస్తరణకు, అధునాతన సౌకర్యాల ఏర్పాటుకు స్థలం చాలకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. సైనిక బలగాల ఆధీనంలో ఉన్న స్థలాన్ని లీజుకు లేదా అద్దె ప్రాతిపదికన తీసుకుని, అక్కడ నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే గిండిలోని పరిశోధనా సంస్థ భవనం, పట్టినంబాక్కంలోని ఖాళీ స్థలాలతో పాటు సైన్యానికి చెందిన స్థలాలను పరిశీలిస్తున్నారు. సైనిక స్థలమైతే క్రమం తప్పకుండా అద్దె చెల్లించి సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు.


