చైన్నె నగరం సమీపంలోని నెమ్మేలి
సముద్రపు నీటి శుద్ధి కర్మాగారంలో
తాగునీటి సరఫరా సగానికి సగం
పడిపోయింది. ప్లాంట్‌లోని ప్రధాన శుద్ధీకరణ విడిభాగాలైన ఫిల్టర్లు , మెంబ్రేన్లు
(ఫిల్టరింగ్ బ్లాక్స్) కొరత ఏర్పడటమే
ఇందుకు కారణంగా సమాచారాలు
వెలువడ్డాయి. రోజువారీ ఉత్పత్తి 25 కోట్ల లీటర్ల నుండి ఒక్కసారిగా 13 కోట్ల లీటర్లకు తగ్గిపోవడంతో, దక్షిణ చైన్నె పరిధిలోని పలు ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు
అంతరాయం ఏర్పడింది.
నెమ్మేలి ప్లాంట్
సాక్షి, చైన్నె : చైన్నె శివారులోని నెమ్మేలిలో సముద్రపు నీటిని తాగునీరుగా మార్చే శుద్ధీకరణ కర్మాగారం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఉత్పత్తి అయ్యే నీటి దక్షిణ చైన్నెలోని పలు ప్రాంతాలకు సరఫరా చేయడం జరుగుతుంది. గత డీఎంకే హయంలో నిర్లవణీకరణ పథకం మేరకు ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు.
విదేశాల నుండి ఫిల్టర్ల సరఫరా ఆగిపోవడంతో..
సముద్రపు నీటిని ఉప్పురహితంగా మార్చే ప్రక్రియలో అత్యంత కీలకమైన ప్రత్యేక ఫిల్టర్లను కొన్ని నెలలకొకసారి మార్చాల్సి ఉంటుంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా విదేశాల నుండి రావాల్సిన ఈ ఫిల్టర్ల రవాణాకు ఆటంకం ఏర్పడింది. 250 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో ఉత్పత్తి 100 మిలియన్ లీటర్లకు, అలాగే 110 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో నీటి ఉత్పత్తి 100 మిలియన్ లీటర్లకు పరిమితమైంది.
నీటి చౌర్యం
నెమ్మేలి మెయిన్ పైప్‌లైన్లకు రంధ్రాలు చేసి దొంగతనంగా నీటిని మళ్ళిస్తుండటం వల్ల మిగిలిన నీరు కూడా ప్రజలకు సరిగ్గా అందడం లేదు. కాగా గత 20 రోజులుగా 3 నుండి 4 రోజులకు ఒకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని, వార్డుల్లో కేవలం 25 శాతం అవసరాలు మాత్రమే తీరుతున్నాయని స్థానిక కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త ఫిల్టర్ల రవాణా ప్రారంభమైందని, పాత ఫిల్టర్ల మార్పిడి పనులు శరవేగంగా చేపట్టనున్నామని, నీటి సరఫరా బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. నీటి చౌర్యం అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దళాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఈ నెలాఖరు నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో ప్లాంట్ల నుండి సాధారణ స్థాయికి నీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా తగ్గిన ప్రాంతాలలో ఇతరప్రాంతాల నుంచి ట్యాంకర్లద్వారా నీటిని అందించే పనిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
సుదీర్ఘ ప్రక్రియ
నీటి శుద్ధి ప్లాంట్‌ను ఒకసారి నిలిపివేస్తే, తిరిగి సాధారణ ఉత్పత్తి స్థాయికి చేరుకోవడానికి దాదాపు 9 గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. ఈ సరఫరా అంతరాయం కారణంగా దక్షిణ చైన్నె పరిధిలోని షోళింగనల్లూరు, అడయార్, పెరుంగుడి, అలందూర్, తేనాంపేట తదితర ప్రాంతాలలో నీటి కొరత తీవ్రంగా మారింది. ఒకవైపు ఉత్పత్తి తగ్గితే, మరోవైపు పైప్‌లైన్ పగుళ్లు – లీకేజీలు సైతం తాజాగా సమస్యగామారి ఉన్నాయి. మెట్రో రైల్ పిల్లర్ల నిర్మాణాలు , ఇతర పనుల వల్ల ప్రధాన సరఫరా పైపులు దెబ్బతింటున్నాయి. పైపులలో నీటి పీడనం తగ్గడంతో ఇళ్లలోని ట్యాంకులు 30 శాతానికి మించి నిండడం లేదు. కొన్నిచోట్ల దుర్వాసనతో కూడిన కలుషిత నీరు వస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు


