టీవీకే జిల్లా కార్యదర్శిపై
లైంగిక వేధింపుల ఫిర్యాదు
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని మాసాపేట పంచాయతిలోని అన్నానగర్ ప్రాంతానికి చెందిన భవ్యలక్ష్మి ఈమె ఆర్కాడు పోలీస్ స్టేషన్‌లో రాణిపేట టీవీకే జిల్లా కార్యదర్శి విజయ్ మోహన్‌పై ఫిర్యాదును అందజేశారు. అందులో.. గత పది నెలల క్రితం విజయ్ మోహన్ తనకు పార్టీలో పదవి ఇప్పిస్తామని మాయ మాటలు చెప్పి వీడియో ఫోన్ కాల్‌లో తనను నగ్నంగా ఉండమని మాట్లాడాడు. ఆ సమయంలో తన నగ్న దృశ్యాలను స్క్రీన్ షాట్ తీసుకొని భద్ర పరుచుకొని అప్పటి నుంచి తన కోరికలు తీర్చాలని పలుమార్లు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈమేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కుక్కల దాడిలో జింక మృతి
తిరుత్తణి: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన శోకాన్ని మిగిల్చింది. తిరువలంగాడు సమీ పంలోని వీరరాఘవపురం కాప్పు అటవీ ప్రాంతంలో జింకలు, నెమలి సహా అనేక వన్య ప్రాణులు నివాశముంటున్నాయి.ఈక్రమంలో పయయనూరు గ్రామ శివారులోని సతీష్‌కుమార్ అనే రైతు జామ తోటలో గురువారం తాగునీటి కోసం ప్రవేశించిన దాదాపు ఆరేళ్ల కృష్జ జింకను అక్కడున్న కుక్కలు చుట్టిముట్టి తీవ్రంగా గాయపరచడంతో జింక మృతి చెందింది. ఆ ప్రాంతం వాసుల సమాచారం మేరకు తిరువలంగాడు పోలీసులు తిరుత్తణి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ సిబ్బంది మృతి చెందిన జింకకు పశుసంవర్ధక శాక డాక్టర్ల ద్వారా పోస్టుమార్టం నిర్వహించి పూడ్చి పెట్టారు. తిరువలంగాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నటి నిధి అగర్వాల్ సందడి
సాక్షి, చైన్నె: ప్రముఖ నటి నిధి అగర్వాల్ చైన్నె ట్రేడ్ సెంటర్‌లో గురువారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సందడి చేస్తూ, హెయిర్ డేర్ యూ రిచువల్స్‌ను ఆవిష్కరించారు. అలాగే, కొరియన్ సాంకేతికత ఆధారంగా రూపొందించిన అధునాతన వాటర్ ఫిల్ట్రేషన్ (నీటి శుద్ధి) పరికరాన్ని ఈ సందర్భంగా ఆమె పరిచయంచేశారు. సహ వ్యవస్థాపకురాలు గాయత్రి దేవి, బ్రాండ్ ఆర్కిటెక్ట్ డైసీ మోర్గాన్‌లు ఈసందర్భంగా సరికొత్త ఆవిష్కరణ గురించి వివరించారు.
ఎన్‌ఐటీ మహిళ ప్రొఫెసర్ అశ్లీల వీడియోలను..
అన్నానగర్: తిరుచ్చిలోని తిరువెరుంభూర్‌లో ఎన్‌ఐటీ కళాశాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నడుపుతోంది. ఈ కళాశాలలో జిల్లా, రాష్ట్రం వెలుపల, విదేశాల నుండి వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా జెరాల్డ్ (50) పనిచేస్తున్నాడు. ఇతను ఎన్‌ఐటీ రెసిడెన్స్‌లో ఉంటాడు. ఇతనికి అదే కళాశాలలోని ఓ మహిళ ప్రొఫెసర్‌కి కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో జెరాల్డ్ తన సెల్ ఫోన్‌లో వారిద్దరినీ కలిసున్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసేవాడు. ఈ క్రమంలో గత సంవత్సరం, వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీని కారణంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, జెరాల్డ్ ప్రొఫెసర్ తన కోరిక తీర్చాలని వేధించాడు. ఆమె నిరాకరించడంతో జెరాల్డ్ అశ్లీల వీడియోలు, ఫోటోలను ప్రొఫెసర్ భర్త, కొంతమంది విద్యార్థుల సెల్ ఫోన్లలో పంపాడు. మహిళా ప్రొఫెసర్ దిగ్భ్రాంతి చెంది, తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. 4 రోజుల క్రితం తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు జెరాల్డ్‌పై కేసు నమోదు చేశారు. ఈ పరిస్థితిలో, సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఉదయం జెరాల్డ్ ను అతని ఇంట్లో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలోకి దూకిన భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి
అన్నానగర్: దిండుక్కల్ జిల్లాలోని నీలకోట్టై సమీపంలోని సుత్తి కాలడి పట్టికి చెందిన అజిత్ కుమార్ (27) ఆటో డ్రైవర్. అజిత్‌కుమార్ ఆత్తూరు సమీపంలోని కూలంపట్టికి చెందిన పవిత్ర (22) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత, నాలుగు నెలల క్రితం, వారి తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవిత్ర మూడు నెలల గర్భవతి. అజిత్‌కుమార్ తరచుగా మద్యం తాగి ఇంటికి వస్తాడు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. బుధవారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరిగింది. దీంతో, పవిత్ర తన భర్తను బెదిరించి, ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన భర్త అజిత్ కుమార్ తన భార్యను కాపాడటానికి బావిలోకి దూకాడు. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. దీని గురించి నీలకొట్టై అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించబడింది. ఫైర్ డిపార్ట్‌మెంట్ స్టేషన్ ఆఫీసర్ భాస్కరన్ నేతత్వంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో పడిపోయిన అజిత్‌కుమార్, అతని భార్యను వారు రక్షించి పైకి తీసుకువచ్చారు. అనంతరం వారిని నీలకోట్టై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు అజిత్‌కుమార్ అప్పటికే మరణించినట్లు తెలిపారు. అతని భార్య చికిత్స పొందుతోంది. నీలకోట్టై ఇనన్‌స్పెక్టర్ సత్యకుమార్ కేసు నమోదు చేసి ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.


