సాక్షి, చైన్నె : ‘మన్నార్ వగైయారా’ సినిమా నిర్మా ణం కోసం తీసుకున్న రూ.4.5 కోట్ల రుణానికి సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ తమిళ నటుడు విమ ల్‌కు చైన్నె కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును న్యాయమూర్తి తాత్కాలికంగా నిలిపివేశారు.
రుణం – చెక్ బౌన్స్ : నటుడు విమల్ నటిస్తూ నిర్మించిన చిత్రం ’మన్నార్ వగైయారా’. ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన సినీ ఫైనాన్షియర్ గోపి వద్ద రూ. 4.5 కోట్ల రుణం తీసుకున్నారు. సినిమా విడుదలైనప్పటికీ ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో విమల్ ఒక చెక్కును ఫైనాన్షియర్‌కు అందించారు. ఫైనాన్షియర్ గోపి ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో అది బౌన్స్ అయింది. దీంతో ఆయన విమల్‌పై చైన్నె కోర్టులో చెక్ మోసం కేసు దాఖలు చేశారు.
కోర్టు తీర్పు – పరిణామాలు : గురువారం కేసు విచారణలో భాగంగా ఫైనాన్షియర్ తరఫున న్యాయవాది ఆర్. వెంకటేష్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి, విమల్‌పై ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించడమే కాకుండా, తీసుకున్న రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించారు. తీర్పు వెలువడే సమయంలో నటుడు విమల్ కోర్టులోనే ఉన్నారు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకుంటామని, అంతవరకు శిక్ష అమలును నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా, దానికి అంగీకరించిన న్యాయమూర్తి శిక్షపై తాత్కాలికంగా స్టే విధించారు.


