తిరువళ్లూరు: నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై ఢిల్లీలో లాఠీచార్జ్ చేసిన పోలీసుల తీరును నిరసిస్తూ, కాంగ్రేస్, వీసీకే ఆద్వర్యంలో వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఉదయం ధర్నా నిర్వహించారు. తిరువళ్లూరు పెద్దకుప్పంలో జరిగిన ధర్నాకు జిల్లా అధ్యక్షుడు శశికుమార్ అద్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యదేశంలో పోరాటం చేయడానికి ప్రజలకు వున్న హక్కులను బీజేపీ ప్రభుత్వం హరిస్తుందన్నారు. దీంతో పాటూ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీని అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ ఆందోళనలో పీసీసీ ఉపాధ్యక్షుడు ఏకాటూరు ఆనందన్, రాష్ట్ర కార్యదర్శి సీపీ మోహన్‌దాస్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిదివాకర్, ఓబీసీ విభాగం వర్కింగ్ కమిటి రాష్ట్ర అద్యక్షుడు వెంకటేషన్, మైనారీటి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖలీల్‌రహ్మాన్, మండల అధ్యక్షుడు పూండి షణ్ముగం, నగర అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
వీసీకే ఆధ్వర్యంలో ధర్నా: నీట్ పరీక్షల నిర్వాహణలో విఫలమైన కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ పరీక్ష పేపర్లు లీకేజీ వ్యవహరంపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ వీసికే ఆధ్వంర్యంలో ఈకాడు బీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీనియర్ నేత నీలవానత్తునిలవన్, రీజినల్ కో– ఆర్డినేటర్ ధళపతిసుందరం, జిల్లా కన్వీనర్ అరుణ్‌గౌతమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


