వేలూరు: వేలూరు కలెక్టరేట్ సమీపంలోని సత్‌వచ్చారి వద్ద ఉన్న సర్వీస్ రోడ్డులో ఆక్రమణలు ఉన్నందున తరచూ ట్రాపిక్ సమస్య ఏర్పడుతున్నట్లు వేలూరుకు చెందిన ఒకరు చైన్నె హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని జాతీయ రహదారుల శాఖకు చైన్నె హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో గురువారం ఉదయం జాతీయ రహదారుల శాఖ అధికారులు వేలూరు కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి హైకోర్టు పంపిన తీర్పు లేఖను పంపింది. దీంతో ఆక్రమణలు తొలగించాలని దుకాణదారులకు గత పది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అదే విధంగా పోలీసులు మైకు ద్వారా దుకాణ దారులకు తెలిపారు. పల్లిగొండ టోల్‌గేట్ ప్రత్యేక అధికారి జస్టిన్ సామ్‌సన్, అసిస్టెంట్ మేనేజర్‌లు సురేష్‌ల ఆదేశాల మేరకు పోలీసులు, జేసీబీ సాయంతో రోడ్డు పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించారు. కొంత మంది దుకాణ దారుల వీటిని అడ్డుకోవడంతో పోలీసులు దుకాణ దారులతో చర్చలు జరిపి అక్కడి నుంచి పంపించి వేశారు.


