వేలూరు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సోమనాయకన్‌బట్టి గ్రామంలోని పచ్చయప్పన్‌కు సొంతమైన ఇంటిలో ఎర్రచందనం దాచి ఉంచినట్లు అటవీశాఖ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో తిరుపత్తూరు అటవీశాఖ అధికారి మహేంద్రన్ ఆదేశాల మేరకు సుమారు పది మందికి పైగా అటవీశాఖ సిబ్బంది మంగళవారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెల్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న కొంత మంది ఎర్రచందనాన్ని తాకట్టు పెట్టి జూదం ఆడుతున్నట్లు గుర్తించారు. అక్కడున్న వారు అటవీశాఖ సిబ్బందిని చూసిన వెంటనే అక్కడ నుంచి పరారీ అయ్యారు. అనంతరం సిబ్బంది ఇంటిలో అకస్మిక తనిఖీలు చేయగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన సుమారు 60 కిలోల బరువు గల రెండు ఎర్రచందనం తుండ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడ ఉన్న ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకొని కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ రెండు ఎర్రచందనం విలువ సుమారు రూ: 4 లక్షలు ఉండవచ్చునని అటవీశాఖ అధికారులు తెలిపారు. జూదం ఆడుతున్న ప్రాంతంలో ఇద్దరు ఉండటంతో వారిని అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నారు.


