వేలూరు: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు వైద్య సేవలు అందజేయడంలో నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ లీల అలెక్స్ అన్నారు. వేలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు 16వ స్నాతికోత్సవం కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ రోహిణీదేవి అధ్యక్షతన బుధవారం ఉదయం అడుక్కంబరైలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సేవలకన్నా వైద్య సేవలు ముఖ్యమైనదన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు డాక్టర్‌లు ముఖ్య పాత్ర వహిస్తారన్నారు. వైద్య విభాగంలో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలకు వెళ్లకుండా రోగులకు అవసరమైన మందులను కనుగొనేందుకు ఆసక్తి చూపాలన్నారు. అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రస్తుతం డాక్టర్ పట్టాలను సాదించారని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు అధికంగా నిరుపేదలు కావడంతో వారి పట్ల ప్రేమగా పలకరించి వైద్య సేవలు అందజేయాలన్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టరేట్ డిగ్రీ పట్టాలతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేలయగన్, సిందు, తెండ్రల్‌కుమార్, సుధాకర్, సుకుమార్, మెడికల్ కళాశాల సూపరిండెంట్ రది తిలగం, వైస్ ప్రిన్సిపాల్ మరుగౌరీ విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


