డీఎంకే గుర్తుపై పోటీ చేయడం దురదృష్టకరం | - | Sakshi
Sakshi News home page

డీఎంకే గుర్తుపై పోటీ చేయడం దురదృష్టకరం

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

● దురై వైకో వ్యాఖ్యలు ● విజయ్‌కు ఆహ్వానం

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికల విజయం అనంతరం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ డీఎంకే కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే ఎంపీ దురై వైకో స్వయంగా పలకడం చర్చకు దారి తీసింది. అంతే కాదు, డీఎంకే చిహ్నంపై తాము పోటీ చేయడం దురదృష్టకరం అని ఆవేదనతో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్‌కు తిరుచ్చి లోక్‌సభ సభ్యుడైన దురై వైకో శాలువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. విజయ్‌ సీఎం అయిన తర్వాత ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకోను నేరుగా కలిసి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దురై వైకో వరుసగా విజయ్‌పై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సీఎం విజయ్‌కు ఆహ్వానం పలికినానంతరం దురై వైకో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్‌ గారు తొలిసారి తిరుచ్చి వచ్చారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గ ఎంపీగా ఆయనకు స్వాగతం పలకడం నా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రిని అధికారికంగా కలిసి తిరుచ్చి లోక్‌సభ పరిధిలోని పెండింగ్‌ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తానని పేర్కొన్నారు. అలాగే, తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణకు కేంద్రం నుండి నిధులు రాబట్టేందుకు ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిశానని తెలిపారు.

సాంకేతిక కారణాల వల్లే..

పొత్తులు, అసెంబ్లీ సమీకరణాలపై చేసిన వ్యాఖ్యలు డీఎంకే వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తమ ఎండీఎంకే ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తూ ఎన్నికల్లో డీఎంకేకు చెందిన ఉదయసూర్యుడు గుర్తుపై పోటీ చేసి గెలిచారన్నారు. ఆ సాంకేతిక కారణం వల్లే ఈరోజు తాము అసెంబ్లీలో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి నేరుగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే, గతంలో తమ కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు వంటి ఇతర ప్రజాస్వామ్య శక్తులు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రజలు టీవీకేను సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా గెలిపించారని, ఆ ప్రజా తీర్పును అందరూ గౌరవించాలన్నారు. భవిష్యత్తులో ఎండీఎంకే ఏ కూటమిలో ఉండాలో అన్న విషయంగా జూన్‌ 27వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement