పద్మరాజన్‌ నామినేషన్‌! | - | Sakshi
Sakshi News home page

పద్మరాజన్‌ నామినేషన్‌!

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

● 255వ సారి దాఖలు

సాక్షి, చైన్నె: రాజ్యసభ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఎలక్షన్‌ కింగ్‌ పద్మరాజన్‌ 255వ సారి తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి సమర్పించారు. అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీగా ఉన్న ఓ రాజ్యసభ స్థానానికి ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. చైన్నెలోని సచివాలయ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక సార్లు ఓటమి పాలై ఎలక్షన్‌ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సేలంకు చెందిన ప్రముఖ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్‌ కె. పద్మరాజన్‌ మరోసారి అందరికంటే ముందుగా తన నామినేషన్‌ పత్రాన్ని సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తేన్మోళికి ఆయన తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. పద్మరాజన్‌ ఎన్నికల బరిలోకి దిగడం ఇది వరుసగా 255వ సారి కావడం విశేషం. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం పద్మరాజన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఒక ముఖ్యమైన విజ్ఞప్తిని లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం మన ప్రాచీన తమిళ సంస్కృతికి సంబంధించిన ఐదు ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక చిహ్నాలను అధికారికంగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. తాను 1988లో మొదటిసారిగా మెట్టూరు అసెంబ్లీ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయడం ప్రారంభించానని గుర్తు చేశారు. అప్పటినుంచి స్థానిక సంస్థల ఎన్నికల నుండి రాష్ట్రపతి ఎన్నికల వరకు ఏ ఎన్నికనూ వదలకుండా పోటీ చేస్తూనే ఉన్నానని వివరించారు. ఎన్నికల డిపాజిట్లు, ప్రయాణ ఖర్చుల కోసం తన సొంత సంపాదన నుండి ఇప్పటివరకు సుమారు రూ. కోటి వరకు ఖర్చు చేశానన్నారు. ఓడిపోతామని తెలిసి కూడా తనలా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొంటూ, సామాన్యుడు కూడా ఎన్నికల్లో నిలబడొచ్చని నిరూపించడానికే, వారందరికీ ఒక ఆదర్శంగా నిలవడానికే ప్రతిసారీ పట్టుదలగా నామినేషన్‌ వేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement