సాక్షి, చైన్నె: దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా నియమితులై తమిళనాడుకు చెందిన సీనియర్ న్యాయవాది వి. మోహన సరికొత్త చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టనున్న తమిళనాడుకు చెందిన మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక నియామకంపై తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇక తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ అడ్వకేట్ వి. మోహన నియామకంతో సుప్రీంకోర్టు చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. కాగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, ఏకంగా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవుతున్న భారతదేశపు రెండవ మహిళా న్యాయమూర్తిగా ఆమె మరో రికార్డు సృష్టించారు.
మహిళా సాధికారతకు నిదర్శనం
ఆమెకు దక్కిన గుర్తింపుపై సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా అభినందనలు తెలియజేశారు. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తిగా తమిళనాడు, కోయంబత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది వెంకిడ సుబ్రమణి మోహన గారు నియమితులవ్వడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే నేరుగా న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన రెండో మహిళగా, తమిళనాడు నుండి ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారన్నారు. జస్టిస్ మోహన ఈ నియామకం దేశంలో, రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధికి, వారి ఆర్థిక సాధికారతకు , సామాజిక పురోగతికి ఒక గొప్ప ఉత్తేజకర శక్తిగా నిలుస్తుందన్నారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టబోతున్న జస్టిస్ మోహనకు తన తరపున, తమిళనాడు ప్రభుత్వం , రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆమోద ముద్ర అనంతరం జస్టిస్ వి. మోహన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళనాడుకు చెందిన ఒక మహిళా న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానంలో అడుగుపెట్టనుండటం పై తమిళనాడు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


