సాక్షి,చైన్నె : అన్నాడీఎంకేకు చెందిన పలువురు నాయకులు గురువారం డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీలోచేరారు. వీరిలో ఆలందూరు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామన్ కూడా ఉన్నారు. కాంచీపురం, ఆలందూర్ పరిధికి చెందిన పలువురు అన్నాడీఎంకే కీలక డీఎంకే పార్టీలో చేరారు. డీఎంకే అధినేత స్టాలిన్ సమక్షంలో చైన్నెలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే వెంకట్రామన్ నేతృత్వంలో ఎన్. ధనశేఖరన్ (ఉమ్మడి కాంచీపురం జిల్లా మాజీ కోశాధికారి), కె. ఇలంగో (ఆలందూరు తూర్పు ప్రాంత వర్తక విభాగ కార్యదర్శి),టి. జయప్రతాప్ (జిల్లా విద్యార్థి విభాగ ఉప కార్యదర్శి), మొసైక్ బాబు (ఆలందూరు తూర్పు ప్రాంత ఎంజీఆర్ ఫోరమ్ కార్యదర్శి), ఆడిటర్ పి. కుమరగురు, పరంతామన్, ఎస్. గోమతినాయగం తదితరులు డీఎంకేలోచేరిన వారిలో ఉన్నారు.
కన్యాకుమారి తీరంలో
కల్లోలంగా సముద్రం
కొరుక్కుపేట: సునామీ తర్వాత కన్యాకుమారి సముద్ర తీరంలో అనేక ప్రకతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పౌర్ణమి సమీపిస్తుండటంతో గురువారం ఉదయం కన్యాకుమారి సముద్రం ’అకస్మాత్తుగా’ అల్లకల్లోలంగా మారింది. దీని కారణంగా, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం , అరేబియా సముద్రం అనే మూడు సముద్రాలు తీవ్ర కల్లోలానికి గురయ్యాయి. భారీ అలలు సుమారు 10 నుండి 15 అడుగుల ఎత్తుకు ఎగసిపడి, భయంకరంగా విరుచుకుపడ్డాయి. సముద్ర తీరంలో నిలబడి సముద్ర సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న పర్యాటకులు, ఒడ్డు వైపు దూసుకొస్తున్న భారీ అలలను చూసి కేకలు వేసి పారిపోయారు. అప్పుడప్పుడు సంభవించే సముద్రపు తుపానుల కారణంగా, పర్యాటక పోలీసులు కుమారి సముద్రంలో స్నానం చేయకుండా పర్యాటకులను నిషేధించారు. దీంతో కన్యాకుమారి ముక్కడల్ సంగమం బీచ్ ప్రాంతం పర్యాటకులు లేకుండా నిర్మానుష్యంగా మారింది. బంగాళాఖాతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల, ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన వివేకానంద మండపానికి పడవ సర్వీసును కూడా రద్దు చేశారు. ఫలితంగా, పర్యాటకులు పడవ కేంద్రం వద్ద చాలా గంటలపాటు వేచి ఉండి, పడవలో వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహం, గ్లాస్ బ్రిడ్జ్‌ను సందర్శించలేక నిరాశతో ఇళ్లకు తిరిగి వెళ్లారు.
జూన్ 1 నుంచి 60 టోల్ ప్లాజాల్లో ఫీజుల పెంపు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగియడంతో 60 టోల్ ప్లాజాలలో ఫీజుల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కార్లు, జీపుల రోజువారీ ప్రయాణికులకు ఊరట కాస్త కలిగినా, భారీ వాహనాలపై ప్రభావం పడే విధంగా టోల్ మోత మోగనుంది. ఏటా ఏప్రిల్‌లోనే టోల్ వడ్డన జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పోలింగ్, ఓట్ల లెక్లింపు ప్రక్రియలు పూర్తిగా ముగిసి, నియమావళి సడలించడంతో జూన్ 1 నుండి పెంపును అధికారికంగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. మధ్యతరగతి ప్రజలకు, రోజువారీ ప్రయాణికులకు ఊరట కలిగిస్తూ కార్లు, జీపులు, త్రిచక్ర , లఘు వాహనాల సింగిల్ జర్నీ, రౌండ్ ట్రిప్ టోల్ ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అయితే బస్సులు, లారీలు, బహుళ–యాక్సిల్ భారీ వాణిజ్య వాహనాలపై ఈ పెంపు ప్రభావం గట్టిగా పడనుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌చార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా టోల్ వడ్డనతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుత్తణి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.51 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయ హుండీల్లో భక్తులు రూ. 1.51 కోట్లు చెల్లించినట్లు ఆలయ అధికారి తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంకు రోజూ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసి తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో నగలు, నగదు వస్తువులు చెల్లిస్తుంటారు. భక్తులు చెల్లించిన కానుకలు ప్రతినెలా ఆలయ అధికారుల సమక్షంలో తెరిచి లెక్కించడం పరిపాటి. 28 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలు ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలు తెరిచి కానుకలు లెక్కింపు చేపట్టారు. నగదు రూ. కోటి 51.55 లక్షలు, 358 గ్రాముల బంగారం, 6,623 గ్రాముల వెండి లభించినట్లు పేర్కొన్నారు.


