తమిళసినిమా: దక్షిణాదిలో అరుదైన అవకాశాలను అందుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సే. జయపజయాలను పక్కన పెడితే ఈమె నటించిన, నటిస్తున్న చిత్రాలన్నీ ప్రముఖ హీరోలతోనో, ప్రముఖ నిర్మాణ సంస్థల్లోనో రూపొందుతుండటం విశేషం. ఇంతకు ముందు తెలుగులో రవితేజకు జంటగా మిస్టర్ బచ్చన్ చిత్రంలో నటించారు. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కిన కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్, రానాలతో కలిసి నటించారు. ఇలా క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే తాజాగా నటుడు కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న సెయోన్ చిత్రంలో శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్నారు. తాయ్ కిళవి చిత్రం ఫేమ్ శివకుమార్ మురుగేశన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. కాగా ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న నటి భాగ్యశ్రీబోర్సే నటుడు కమలహాసన్‌ను నేరుగా కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆమె తన ఎక్స్ మీడియలో కమలహాసన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి ‘‘ఎంతో అభిమానం కలిగిన కమలహాసన్ సార్, మీ ఎదుగుదలను చూస్తూ పెరిగాను. అలా నా మనసులో ఉన్న మీరు ఇప్పుడు నా భుజంపై చేయి వేసి శుభాకాంక్షలు అందించిన క్షణాన కలిగిన ఆనందంలో తేలియాడుతున్నాను. రాజ్‌కమల్ సంస్థలో నటించడం ఘనతగా భావిస్తున్నాను. మిమ్మల్ని గర్వపరచే విధంగా నేను పని చేస్తాను’’ అని నటి భాగ్యశ్రీ బోర్సే పేర్కొన్నారు. ఈమె తమిళంలో ఇంతకు ముందు నటించిన కాంత చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, నటిగా మాత్రం మంచి ప్రశంసలనే అందుకున్నారు. కాగా ఈ సారి శివకార్తికేయన్ సరసన నటిస్తున్న సెయోన్ చిత్రంతో విజయాన్ని అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారీ భామ.


