తమిళసినిమా: ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టే విధంగా మాట్లాడే నటి, నిర్మాత, రాజకీయనాయకురాలు కుష్బూసుందర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె తాజాగా తన అవ్నీ మూవీస్ సంస్థ బెంజ్ మీడియా సంస్థతో కలిసి నిర్మించిన చిత్రం డబుల్ ఆక్యుపెన్సీ. అశ్విన్ కందసామి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో సంతోష్, సంయుక్త విశ్వనాథ్, రేష్మావెంకటేశ్, వినోద్‌కిషన్, వీటీవీ.గణేశ్, భగవతి పెరుమాళ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కుష్బూ వారసురాలు ఆనందిత నిర్మాణ నిర్వహణ బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, శాంతకుమార్ చక్రవర్తి చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చైన్నెలో నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కుష్బూ మాట్లాడుతూ చాలా తక్కువ కాలంలోనే ఇలాంటి టీమ్ అమరడం అనేది దేవుడు రాసి పెట్టిన కనెక్షన్ అనే చెప్పాలన్నారు. ఇందులో నటించిన సంతోష్, తన కూతురు ఆనందిత పాఠశాల నుంచి స్నేహితులని, అయితే మొదట్లో వీరికి ఒకరంటే ఒకరికి పడేది కాదని అన్నారు. అలాంటిది వారిద్దరే ఈ చిత్ర కథను తన వద్దకు తీసుకొచ్చారని, ఆ తరువాత దర్శకుడు అశ్విన్‌కందసామి వచ్చారని చెప్పారు. ఆనందిత ఈ చిత్రం ద్వారా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పరిచయం అయ్యారని చెప్పారు. ఈతరం యువతకు మనం చెప్పాల్సిందేమీ లేదని, వారి నుంచే ఏమి నేర్చుకోవాలన్నదే ఈ చిత్రం అని పేర్కొన్నారు. ఆనందిత మాట్లాడుతూ అమ్మ, నాన్న ప్రోత్సాహం లేకుంటే తానీ వేదికపై ఉండేదానినే కాదన్నారు నాన్న చేసిన చిత్రాలను రీమేక్ చేయడం తనకు సాధ్యం కాదన్నారు. డబుల్ ఆక్యుపంచరీ చిత్ర షూటింగ్ మంచి అనుభవంగా ఆమె పేర్కొన్నారు.


