క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

● సకాలంలో గుర్తించిన పైలట్‌ ● మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఇంజిన్‌లో లోపం

కొరుక్కుపేట: చైన్నె నుంచి లండన్‌కు వెళ్తున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో అకస్మాత్తుగా ఇంజిన్‌లో వైఫల్యం తలెత్తింది, కానీ పైలట్‌ నైపుణ్యంతో 252 మంది ప్రయాణికులు సహా మొత్తం 264 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ ప్రయాణికుల విమానం యధావిధిగా గురువారం లండన్‌ నుంచి చైన్నెకి ఉదయం 3.30 గంటలకు చేరుకుంది. ఉదయం 5.35 గంటలకు చైన్నె నుంచి లండన్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. 252 మంది ప్రయాణి కులు చైన్నె విమానాశ్రయానికి చేరుకుని, భద్రతా తనిఖీలు, పౌరసత్వ తనిఖీలు, కస్టమ్స్‌ తనిఖీలు పూర్తి చేసుకుని, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం ఎక్కడానికి వేచి ఉన్నారు. లండన్‌ నుంచి వచ్చిన విమానం చైన్నెకి చేరుకోగానే, మొత్తం 252 మంది తోపాటు సిబ్బంది సహా మొత్తం 264 మందితో ఆ విమానం చైన్నె నుంచి బయలుదేరి రన్‌వేపై ముందుకు సాగింది. ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్‌ అకస్మాత్తుగా గుర్తించి నిలిపివేశారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత ఉదయం 7.30 లండన్‌కు బయలుదేరింది.

తిరుత్తణిలో ఒక్కటైన

అన్నాడీఎంకే వర్గాలు

తిరుత్తణి: అన్నాడీఎంకేలో రెండు గ్రూపులుగా విడిపోయిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆధ్వర్యంలో ఏకతాటిపైకి రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతుగా షణ్ముగం ఆధ్వర్యంలో ఒక గ్రూపు, టీవీకేను వ్యతిరేకిస్తూ పళనిస్వామి ఆధ్వర్యంలో గ్రూపులుగా చీలిపోయాయి. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తలోదిక్కు గ్రూపు రాజకీయాలు చేపట్టారు. తిరుత్తణి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన హరి షణ్ముగం గ్రూపునకు వెళ్లారు. దీంతో 20 రోజులుగా గ్రూపు రాజకీయాలు జోరుగా సాగడంతో చైన్నెకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో రెండు గ్రూపులు చర్చలు చేపట్టి ఏకమైయ్యాయి. దీంతో తొలిసారిగా బుధవారం సాయంత్రం తిరుత్తణికి వచ్చేసిన ఎమ్మెల్యే హరికి ఆ పార్టీ నాయకులందరూ కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు హరి పూలమాళలు వేసి నివాళులర్పించారు. పళనిస్వామి ఆద్వర్యంలో అన్నాడీఎంకేను బలోపేతంకు అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే హరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఆ పార్టీ మండల కార్యదర్శులు టీడీ. శ్రీనివాసన్‌, కృష్ణమనాయుడు, రవి, కుమార్‌, నీలకంఠన్‌, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు జయశేఖర్‌బాబు పాల్గొన్నారు.

మాతృవంశం ఆధారంగానూ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి

కొరుక్కుపేట: మాతృవంశం ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు తగిన పత్రాలు జారీ చేయాలని మద్రాస్‌ హైకోర్టు పుదుచ్చేరి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.లింగ వివక్షతో కూడుకున్నది కావడంతో, కుల ధ్రువీకరణ పత్రాలను కేవలం తండ్రి వంశం ఆధారంగానే జారీ చేయాలని పేర్కొంటూ 2000 సంవత్సరంలో పుదుచ్చేరి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును మద్రాస్‌ హైకోర్టు అప్పటికే కొట్టివేసింది. ఈ తీర్పును 2023లో సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. అంతేకాకుండా, 2025 మేలో, ధ్రువీకరణ పత్రాలను తల్లి వంశం ఆధారంగా జారీ చేయా లని హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన అప్పీలును, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖను ఉటంకిస్తూ పుదుచ్చేరి ప్రభుత్వం ప్రసూతి ధ్రువీకరణ పత్రా ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో సెంటాక్‌ వైద్య ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోబోతున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యా రు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చైన్నె హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులు జస్టిస్‌ స్వామినాథన్‌, లక్ష్మీ నారాయణ్‌ ఎదుట విచారణకు వచ్చాయి. పిటి షనర్ల తరఫున న్యాయవాది స్టాలిన్‌ అభిమన్యు వా దించారు. సుప్రీంకోర్టులో ఒక అప్పీల్‌ కేసు పెండింగ్‌లో ఉన్నందున, సర్టిఫికెట్లను తాత్కాలికంగా జారీ చేయలేదని ప్రభుత్వం వాదించింది. ప్రభు త్వ వాదనతో తీవ్ర అసంతృప్తి చెందిన న్యాయమూర్తులు, హైకోర్టు గత తీర్పులపై ఎలాంటి స్టే విధించనప్పుడు ఆదేశాల అమలును ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తాగునీటి కోసం రాస్తారోకో

తిరుత్తణి: తాగునీటి ఎద్దడితో ఆగ్రహం చెందిన మహిళలు గురువారం ఉదయం రాస్తారోకో చేశారు. దీంతో పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో గంటపాటు ట్రాఫిక్‌ స్తంభించింది. తిరుత్తణి మున్సిపాలిటీలోని పాపిరెడ్డిపల్లెలో పది రోజుల నుంచి విద్యుత్‌ కోతలతో తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో ఆ ప్రాంత మహిళలు 30 మంది గురువారం తిరుత్తణి –పొదటూరుపేట రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేశారు. తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement