‘అగ్ని నక్షత్రం’ షురూ | - | Sakshi
Sakshi News home page

‘అగ్ని నక్షత్రం’ షురూ

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

● ఓవైపు అకాల వర్షం ● మరోవైపు భానుడి భగభగ

సాక్షి, చైన్నె : తమిళనాడులో మార్చి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత , వడగాలులు గణనీయంగా పెరిగాయి. అయితే తూర్పు , ఆగ్నేయ దిశల నుండి వీస్తున్న గాలుల కారణంగా పశ్చిమ కనుమలు, దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాలలో రామనాథపురం, విరుదునగర్‌, మదురై, తేని, పుదుక్కోట్టై, శివగంగ, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, ఈరోడ్‌, నీలగిరి, పెరంబలూరు, సేలం జిల్లాల్లో భారీ వర్షాలు అనేక చోట్ల నమోదయ్యాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం నెలకొంది. అయితే, ఉత్తర తమిళనాడులో మాత్రం భానుడు ఏ మాత్రం తగ్గలేదు. తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం విల విలలాడుతున్నారు. సోమవారం నుంచి ఈప్రభావంమరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం పకటించింది.

నేటి నుంచి అగ్ని నక్షత్రం

ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ’ఎల్‌ నినో’ పరిస్థితుల వల్ల బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రభావంతో సోమవారం నుంచి మే 28 వరకు ’అగ్ని నక్షత్రం’ (కత్తెర) నెల ప్రారంభం కానుంది. ఈ కాలంలో తమిళనాడు వ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదులుతుండటం వల్ల ఉత్తర తీర జిల్లాల్లో మే నెల మూడో వారం వరకు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఎండలు మండిపోయినా, సాయంత్రం వేళల్లో కురిసే వర్షాల వల్ల రాత్రి పూట చల్లబడే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచించారు. శరీర వేడిని తగ్గించుకోవడానికి మజ్జిగ, పండ్ల రసాలు,తగినంత నీరు ఎక్కువగా తాగాలని సూచించారు.

ఈదురు గాలుల దాడి

తిరుప్పూర్‌, తిరుచ్చి, పెరంబలూరు, కరూర్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు బీభత్సం సృష్టించారు. తిరుప్పూర్‌ రహదారిలో ప్లెక్సీ ఊడి పడటంతో ఓ మోటారు సైకిలిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుచ్చి, తిరువెరుంబూర్‌, లాల్‌గుడి తదితర ప్రాంతాల్లో గంటకు పైగా కురిసిన వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.చెట్లు విరిగి విద్యుత్‌ తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెరంబలూరు, కరూర్‌లో వీచిన బలమైన గాలులతో పట్టణంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన హోర్డింగులు, ప్రకటనల బ్యానర్లు చిరిగిపోయాయి. కాగా, అకాల వర్షాలు తాము సాగు చేసిన నువ్వులు, ఉల్లి, మినప పప్పు వంటి పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement