సురక్షిత ప్రయాణానికి సహకరించండి | - | Sakshi
Sakshi News home page

సురక్షిత ప్రయాణానికి సహకరించండి

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

●సరైన టికెట్‌ తీసుకోవాలని చైన్నె డివిజన్‌ విజ్ఞప్తి

సాక్షి, చైన్నె : సురక్షితమైన, సౌకర్యవంతమైన , చట్టబద్ధమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ప్రయాణికులందరూ రైలు ఎక్కడానికి ముందే సరైన టికెట్లు తీసుకోవాలని దక్షిణ రైల్వేకు చెందిన చైన్నె డివిజన్‌ విజ్ఞప్తి చేసింది.సరైన టికెట్‌తో ప్రయాణించడం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, అది ఒక సామాజిక బాధ్యత కూడా అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇది రైల్వే సేవలను మెరుగుపరచడమే కాకుండా, ముందుగా ప్లాన్‌ చేసుకుని ప్రయాణించే ప్రయాణికుల హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. సరైన టికెట్లు లేకుండా ప్రయాణించడం వల్ల రైళ్లలో రద్దీ పెరిగి, ఇతర ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు దెబ్బతింటాయని వెల్లడించారు.

టికెట్‌ తనిఖీల్లో కీలక గణాంకాలు

ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటానికి , టికెట్‌ లేని ప్రయాణాలను అడ్డుకోవడానికి చైన్నె డివిజన్‌ పరిధిలోని సబర్బన్‌ (లోకల్‌), ఎక్స్‌ప్రెస్‌ , ప్రత్యేక రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలలో టికెట్‌ లేని ప్రయాణాలు , నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన వారిపై 12.24 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కఠినమైన చర్యల ద్వారా రైల్వే శాఖ రూ.65.16 కోట్ల జరిమానా వసూలు చేసింది. ఇది రైల్వే శాఖ నిర్దేశించుకున్న వార్షిక లక్ష్యం కంటే ఎక్కువ కావడం గమనార్హం.

డిజిటల్‌ టికెటింగ్‌ పద్ధతులను వాడండి

ప్రయాణికులు జరిమానాలు, చట్టపరమైన చర్యల బారిన పడకుండా ఉండటానికి రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందే సరైన టికెట్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వ్‌డ్‌, అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను రైల్‌ ఒన్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బుక్‌ చేసుకోవాలని కోరారు. ఇవే కాకుండా, ప్రధాన రైల్వే స్టేషన్లలో ఉన్న ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లు (, కౌంటర్ల ద్వారా కూడా టికెట్లను పొందవచ్చు అని, అందరికీ సురక్షితమైన , ఆహ్లాదకరమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు ప్రయాణికులందరూ సహకరించాలని చైన్నె రైల్వే డివిజన్‌ కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement