తమిళసినిమా: ఇప్పుడు సినీ, రాజకీయరంగాలు నటి త్రిష చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని ఎవరూ కాదనలేరు. కారణం ఈమెకు నటుడు, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షడు విజయ్‌కు మధ్య ఉన్న స్నేహమే. ఈ స్నేహాన్ని కొందరు వేరే విధంగానూ భావిస్తుంటారు. ఈమె తాజాగా సూర్యకు జంటగా నటించిన కరుప్ప చిత్ర ఆడియో వేడుక ఇటీవల మదురైలో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రిష పాల్గొనలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరుప్పు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి తనను ఎవరూ ఆహ్వానించలేదని త్రిష చెప్పారు. ఇకపోతే ఈమె గురించి మరో నటి వనితా విజయకుమార్ ఒక భేటీలో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అందులో ముఖ్యంగా విజయ్, త్రిషల వ్యవహారం గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది. విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయడానికి కారణమే త్రిష. విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తారు. అందులో ఒక స్థానానికి రాజీనామా చేసి త్రిషను పోటీ చేయిస్తారు. త్రిష అందుకు అర్హురాలే. జయలలిత మాదిరిగానే త్రిష కూడా చర్చ్ పార్క్ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆమె రాజకీయ నాయకురాలు కావడానికి అర్హురాలు. విజయ్‌కు, త్రిషకు మధ్య ఉన్న బంధాన్ని పక్కన పెట్టి వారి తెలివి, ప్రతిభను మాత్రమే చూడండి. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధాన్ని కొందరు కించపరచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అని వనితా విజయకుమార్ పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల షకీలా కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇకపోతే త్రిష ఇటీవల తన ఇన్‌స్టాలో నా నెల (మే నెల) ప్రారంభమైంది. అని పేర్కొన్నారు. ఆమె మాటలకు చాలా అర్థాలు ఉన్నాయి. సోమవారం తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విజయ్ విజయం తథ్యం అనే ధీమాను త్రిష వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. ఇకపోతే ఇదే రోజు త్రిష జన్మదినం కావడం మరో విశేషం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆమె అలా పేర్కొని ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


