తమిళసినిమా: మణిరత్నం చిత్రాలకు ఆయనే పెద్ద బ్రాండ్. ఏస్ దర్శకుడిగా పేరు గాంచిన ఈయన ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అందులో రజనీకంత్ దళపతి, కమలహాసన్ నాయకన్ వంటి యాక్షన్ ఎంటర్‌టెయినర్ చిత్రాలు, ముంబాయి ,గీతాంజలి వంటి ప్రేమ కథా చిత్రాలు ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ వంటి చారిత్రాత్మక చిత్రం తరువాత మణిరత్నం చేసిన థక్‌లైఫ్ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ ఒక విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవతున్నారు. ఇందులో విజయ్‌సేతుపతి, సాయిపల్లవి జంటగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం మే నెలలో సెట్‌పైకి వెళ్లనుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రారంభం కొంచెం ఆలస్యం కానుందని సమాచారం. జూన్‌గానీ, జూలైలో గానీ ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తాజా సమాచారం. దీనికి కారణం దర్శకుడు మణిరత్నం ఇంకా చిత్ర కథనాన్ని పూర్తి చేసే పనిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో పక్క లైకా ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలనే ప్రచారం సాగుతోంది. ఇందులో ఏది నిజ మో తెలియదు గానీ కొత్త చిత్రం షూటింగ్ మరో నెలలో ఉంటుందని భావి స్తున్నారు.


