ఆధునిక చికిత్స
విధాన వేదికగా
సాక్షి,చైన్నె : అత్యాధునికి చికిత్సల విధానాలు, కొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచే విధంగా రెటికాన్ 2026 ఆదివారం చైన్నెలో జరిగింది. డాక్టర్ అగర్వాల్స్ రెటినా ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫ్లాగ్‌షిప్ సైంటిఫిక్ కాన్ఫరెన్స్ ‘రెటికాన్ 2026’ 16వ ఎడిషన్ ను విజయవంతంచేశారు. రెటినా (కంటి వెనుక భాగంలోని పొర), విట్రియస్ సంబంధిత వ్యాధుల నిర్ధారణ, అత్యాధునిక చికిత్సా విధానాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. భారతదేశంతో పాటు విదేశాల నుంచి విట్రియో–రెటినల్ నిపుణులు, జనరల్ ఆప్తమాలజిస్టులు, పరిశోధకులు, ఆప్తమాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సహా 1,000 మందికి పైగా ప్రతినిధులు ఈసదస్సుకు హాజరయ్యారు. మీనాక్షి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ సి. శ్రీధర్ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్, చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్, విట్రియో–రెటినల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి విచ్చేసిన సుమారు 50 మంది ప్రముఖ వక్తలు మెడికల్ , సర్జికల్ రెటినాకు సంబంధించిన వివిధ అంశాలపై శాసీ్త్రయ ప్రసంగాలు చేశారు. రెటినా సంబంధిత రక్తనాళాల వ్యాధుల చికిత్సలో వస్తున్న మార్పులు, శస్త్రచికిత్సల్లో వస్తున్న సరికొత్త పద్ధతులపై విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ డాక్టర్ అమర్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెటినా నిపుణులు, పరిశోధకులను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ‘రెటికాన్’ ఒక అద్భుతమైన వేదికగా మారిందన్నారు. అగ్రశ్రేణి వైద్యుల విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా సరికొత్త ఆవిష్కరణలకు ఇది నాంది పలుకుతుందన్నారు.. వైద్యులకు నిరంతర విద్యను అందించడం ద్వారా రోగులకు మెరుగైన చికిత్సను అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశోధకులు, నిపుణులను అవార్డులతో సత్కరించారు.


