కొరుక్కుపేట: చైన్నెలోని మైలాపూరు కపాలీశ్వరాలయంలో వసంతోత్సవం–2026 వైభవంగా ప్రారంభమైంది. సరస్వతి విద్యా సాంస్కృతిక ట్రస్టు, కపాలీశ్వరాలయం సంయుక్తంగా దివంగత మాజీ ప్రధాన ట్రస్టీ రవి గరియాలి జ్ఞాపకార్థం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి. నాగప్పన్, అమెరికాకు చెందిన లింకన్ గ్లోబల్ న్యాయ సంస్థ వ్యవస్థాపకుడు ఆర్ ప్రభాకరన్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వసంతోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలలో కళా, సాంస్కృతిక రంగాలలో ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. నగర ప్రముఖులు రోజా కన్నన్ కు ఇందిరా గరియాలి స్మారక అవార్డు, సేలం ఇస్కాన్ అధ్యక్షుడు శ్రీ గోకుల చంద్రదాసుకు శ్రీకాశీనాథ గరియాలి అవార్డు, చైన్నె సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డా సి. హరిహరన్‌కు ’సంస్కృత సేవా భాస్కర పురస్కారం, సుకన్యా రవీందర్‌కు విశిష్ట ఆచార్య పురస్కారం, కాశ్మీరీ సాంస్కృతిక కార్యకర్త పోష్కర్‌నాథ్ రైనాకు ’కాశ్మీర్ రత్న’ పురస్కారం, శైవ సిద్ధాంత పండితుడు ఎస్.కుంజితపాదంకు ఇంజనీర్ కుప్పురాజ్ పురస్కారం’ వేదపండితుడు కల్వకుంట్ల భార్గవాచార్యులకు శ్రీకాశీనాథ్ గరియాలి పురస్కారం ప్రదానం చేశారు. సరస్వతి విద్యా సాంస్కృతిక ట్రస్టు నిర్వాహకురాలు ప్రియదర్శిని రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనెల10వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో పలు సంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.


