తిరుత్తణి: వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతోపాటు సోమవారం నుంచి అగ్ని నక్షత్రం ప్రారంభం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం, సెలవు రోజులు భక్తుల రద్దీ వుండేది. దీంతో మూడు గంటల పాటు వేచివుడి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు.అయితే వేసవి ఎండల తీవ్రత విపరీతంగా పెరిగి వేడి గాలులతో పాటు నిప్పుల సెగలు చోటుచేసుకోవడంతో జనం ఉదయం పది గంటలకు పైబడి ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు మొహం చాటేస్తున్నారు. దీంతో ప్రదాన నగరాల్లో సైతం పగటి సమయాల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా తగ్గింది. పాఠశాలలకు సెలవు, ఆదివారం అయినా భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో కనిపించింది. అర్ధగంటలో స్వామి దర్శనం చేసుకున్నారు. ఎండల తీవ్రతతో భక్తులకు ఆలయ నిర్వాహకులు మజ్జిగ, తాగునీరు సరఫరా చేశారు.


