పాత హాల్ టికెట్‌తో వచ్చిన విద్యార్థిని
సాక్షి, చైన్నె: ఈ పరీక్షకు వ్యతిరేకంగా, పరీక్షల భయంతో ప్రతి ఏటా ఇక్కడి విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలవరాన్ని రేపుతూ వస్తున్నది. ఆది నుంచి ఈ పరీక్షను పాలకులు వ్యతిరేకిస్తున్నా ఫలితం శూన్యం. అయినా, పరీక్షలను విద్యార్థులు ఎదుర్కోక తప్పడం లేదు. నీట్‌కు వ్యతిరేకంగా ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో సైతం తీర్మానం చేశారు. అదే సమయంలో గత అన్నాడీఎంకే హయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల కోసం నీట్‌లో 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్‌ను కేటాయించడం స్థానిక విద్యార్థులకు కాస్త ఊరట. తాజాగా ఎన్నికల నేపథ్యంలోదీనిని 10 శాతం పెంపునకు పార్టీలు వాగ్దానాలు చేసి ఉన్నాయి.
కట్టుదిట్టమైన ఆంక్షలతో..
2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర వైద్య కోర్సులలో చేరాలన్న ఆంక్షతో ఉన్న విద్యార్థుల కోసం ఆదివారం కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షల నడుమ పరీక్ష రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, కడలూరు, తిరుప్పూర్, కరూర్, మదురై, నామక్కల్, సేలం, తంజావూరు, తూత్తుకుడి, ,తిరునల్వేలి, వేలూరు, విరుదునగర్, దిండుగల్, తిరుచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు తదితర 31 జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాలలో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. చైన్నెలో అయితే, సుమారు 40 కేంద్రాలలో పరీక్షా ఏర్పాట్లు చేశారు. ముందుగా విద్యార్థులు పన్నెండు గంటలలోపే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను సరి చూసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈసారి విద్యార్థులు పకడ్భందీ ముందు జాగ్రత్తలోనే వచ్చారు. కట్టుదిట్టమైన ఆంక్షలు, భద్రత నడుమ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను లోనికి అనుమతించారు. ఆథార్, హాల్ టికెట్లను పరిశీలించినానంతరం లోనికి అనుమతించారు. ముందుగానే హెచ్చరికలు చేసిన దృష్ట్యా, విద్యార్థులు అలెర్ట్‌గానే పరీక్షకు హాజరయ్యారు. ప్రతి విద్యార్ధిని ప్రవేశ మార్గంలోనే కాదు, లోపల సైతం క్షుణ్ణంగా తనిఖీల అనంతరం పరీక్షా కేంద్రంలో కేటాయించిన గదుల్లోకి అనుమతించారు. చైన్నెలో ఎండ భగ భగ మంటున్నా విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అప్పటి వరకు సమీపంలోని చెట్ల కింద వేచి ఉన్నారు. పరీక్ష అనంతరం బయటకు వచ్చిన పిల్లలను ఆనందంగా దగ్గరకు చేర్చుకుని, పరీక్షలు ఎలా రాసారో అని వాకబు చేశారు.
బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిన
మహిళా కానిస్టేబుల్
పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రం వద్ద మరో ఘటన జరిగింది. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో ఒక విద్యార్థిని నడుచుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా, సమయం మించిపోతోందని గమనించిన మహిళా కానిస్టేబుల్ భాగ్యలక్ష్మి, వెంటనే తన టూవీలర్‌పై ఆ విద్యార్థినిని ఎక్కించుకుని నిమిషాల వ్యవధిలో పరీక్షా కేంద్రం లోపలికి చేర్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరు విద్యార్థినుల భవిష్యత్తును కాపాడిన పుదుచ్చేరి పోలీసుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుదుచ్చేరిలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు సంఘటనలు పోలీసుల మానవత్వాన్ని చాటిచెప్పాయి. పాత హాల్ టికెట్‌తో వచ్చి ఆందోళనలో పడ్డ ఓ విద్యార్థినికి, అలాగే పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న మరో విద్యార్థినికి పోలీసులు చేసిన సాయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. పుదుచ్చేరి ప్రాంతంలో మొత్తం 9 కేంద్రాలలో నీట్ పరీక్ష జరిగింది. కృష్ణానగర్‌కు చెందిన కనిష్క అనే విద్యార్థిని భారతీదాసన్ ప్రభుత్వ మహిళా కళాశాలలోని పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే, ఆమె పొరపాటున గత సంవత్సరం రాసిన పరీక్షకు సంబంధించిన పాత హాల్ టికెట్ తీసుకొచ్చింది. దీంతో అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని కనిష్క బయటకు వచ్చి తన తండ్రికి చెప్పడంతో ఆయన హుటాహుటిన కొత్త హాల్ టికెట్ తీసుకురావడానికి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో సమయం మధ్యాహ్నం 1.30 గంటలు దాటడంతో పరీక్ష నిబంధనల ప్రకారం అధికారులు గేట్లు మూసివేశారు. తండ్రికి ఫోన్ చేసినా కలవకపోవడంతో ఆ విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురై ఏడవడం ప్రారంభించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, ఇతర విద్యార్థులు ఆమెను ఓదార్చారు. గేటు మూసే చివరి నిమిషంలో ఆమె తండ్రి కొత్త హాల్ టికెట్‌తో అక్కడికి చేరుకున్నారు. సమయం మించిపోతున్నప్పటికీ, అక్కడున్న పోలీసులు, అధికారులు వేగంగా స్పందించి, గేటు తెరిచి ఆమెను పరీక్ష రాయడానికి లోపలికి పంపించారు.


