తిరువొత్తియూరు: మదురై సమీపంలో ఇద్దరు యువకులు దారుణంగా హత్యకు గురయ్యారు. తిరుమంగళం, ఆస్టిన్‌పట్టి పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న సంబకుళం మలుపు సమీపంలో కప్పలూరు మదురై బైపాస్ రోడ్డు మధ్యలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని ఆదివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆస్టిన్ పట్టి పోలీసులు, రోడ్డు మధ్యలో పడి ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి 30 ఏళ్ల యువకుడని, అతని శరీరంపై నరికిన గాయాలు ఉండడాన్ని చూసి పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం నిలయూర్ సంబకుళం రోడ్డులోని వన్నన్ పారై సమీపంలో మరో పురుషుడి మృతదేహం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ అన్షుల్ నగర్ నేతృత్వంలోని ఆస్టిన్ పట్టి పోలీసులు అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాలోని మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో 5,736 మంది విద్యార్థులు ఆదివారం నీట్ పరీక్షలకు హాజరయ్యారు. వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై, విల్లుపురం, క్రిష్ణగిరి జిల్లాలకు చెందిన మొత్తం 5,736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల వద్ద అధికారులు, పోలీసులు కఠినంగా తనిఖీలు చేశారు. విద్యార్థులు బంగారు ఆభరణాలు ధరించేందుకు నిషేధం విధించడంతో విద్యార్థులు చేసేది లేక పరీక్ష కేంద్రాల ఎదుట తల్లిదండ్రుల వద్ద తీసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం విద్యార్థులను మెటల్ డిటెక్టర్ ద్వారా తనిఖీలు చేశారు. విద్యార్థినుల విద్యార్థులు వెంట్రుకలకు రబ్బరు బ్యాండు లేకుండా పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చిరు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది.
తిరువొత్తియూరు: విక్రవాండి సమీపంలో ఓ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈక్రమంలో డ్రైవర్‌తో సహా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా మేల్మరువత్తూరుకు చెందిన గణేశన్ (52), అతని తమ్ముడు పెరుమాళ్ (47) కుటుంబాలకు చెందిన 10 మంది సభ్యులు ఈ వ్యానులో ప్రయాణిస్తున్నారు వీరంతా కుంభకోణం సమీపంలోని ఒక దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ఈ వ్యాన్ విలుపురం జిల్లా విక్రవాండి వారాహ నది వంతెనపై వస్తున్న సమయంలో వ్యాన్ కుడి వైపు వెనుక టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ వద్ద మంటలు అంటుకుని వ్యాన్ అంతా వ్యాపించాయి. డ్రైవర్ బాలచందర్ అప్రమత్తతతో వ్యాన్‌ను పక్కకు ఆపారు. లోపల ఉన్న 10 మంది ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
తిరువొత్తియూరు: తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీపంలోని రోడ్డుపై ఏర్పాటు చేసిన భారీ ప్రకటన (అడ్వర్‌టైజ్‌మెంట్) బ్యానర్ అకస్మాత్తుగా విరిగి పడడంతో, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పల్లడం దాని పరిసర ప్రాంతాలలో ఆదివారం బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న భారీ బ్యానర్ గాలి వేగాన్ని తట్టుకోలేక అకస్మాత్తుగా చినిగి రోడ్డుకు అడ్డంగా పడింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న వారికి బ్యానర్ ముఖానికి తగలడంతో, వారు నియంత్రణ కోల్పోయి రోడ్డుపై పడిపోయారు.గాయపడిన ఇద్దరినీ స్థానికులు రక్షించి, చికిత్స నిమిత్తం పల్లడం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.
అన్నానగర్: ఊత్తంగరై సమీపంలో వృద్ధుడినిని హత్య చేసి, వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్ప డిన కేసులో, నెల రోజుల తర్వాత యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లాలోని ఉతన్‌కరై పక్కన ఉన్న ఒపకవలస ప్రాంతంలో గత నెలలో తన ఇంట్లో నిద్రిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడిని హత్య చేసి, అతని 70 ఏళ్ల భార్యపై లైంగికదాడి చేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ స్థితిలో పోలీసులు అదే ప్రాంతానికి చెందిన మణికంఠన్ (24)ను అరెస్టు చేశారు. హత్యకు గురైన వృద్ధుడి భూమిలో బావి తవ్వేందుకు మణికంఠన్ గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతానికి వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు అతడిని తరచూ విచారిస్తున్నారు.


