కనుల పండువగా అళగర్‌ దశావతారం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా అళగర్‌ దశావతారం

May 4 2026 7:07 AM | Updated on May 4 2026 7:07 AM

● భక్తుల పరవశం

సాక్షి, చైన్నె: ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధురై చిత్తిరై ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం రాత్రంతా జరిగింది. వైగై నది ప్రవేశ కార్యక్రమాన్ని ముగించుకున్న తదుపరి మండుక మహర్షికి శప విమోచనం కల్పించిన కళ్లలగర్‌ స్వామివారికి దశావతారోత్సవం అత్యంత వేడుకగా నిర్వహించారు. మదురై చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

దశావతారాల వైభవం

ఉత్సవాల క్రమంలో భాగంగా కళ్లలగర్‌ వండియూర్‌ పెరుమాళ్‌ ఆలయంలో బస చేశారు. అక్కడి నుండి శేష వాహనంపై బయలుదేరిన స్వామి వారు, వైగై నదిలోని తేనూరు మండపానికి చేరుకుని పూర్వజన్మ వృత్తాంతం ప్రకారం మండూక మహర్షికి శాప విమోచనం ప్రసాదించారు. ఆ తర్వాత రామరాయర్‌ మండపానికి చేరుకున్న స్వామి వారికి రాత్రంతా దశావతార పూజలు జరిగాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువ జాము వరకు లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి దశావతారోత్సవం జరిగింది. మత్స్య, కూర్మ, వామన, రామ అవతారాల్లో స్వామి వారిని అలంకరించి పూజలు చేశారు. వేకువ జామున అద్భుతమైన మోహినీ అలంకారంలో భక్తులకు స్వామి వారు దర్శనమిచ్చారు. చివరగా కృష్ణుడి రూపంలో అవతరించిన అళగర్‌ స్వామి రామరాయర్‌ మండపం నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి ఈ దశావతార రూపాలను చూసి భక్తులు పులకించిపోయారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రామరాయర్‌ మండపంలో అనంతరాయల రాజ పల్లకిపై స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది.రాత్రి 10 గంటల సమయంలో మన్నార్‌ సేతుపతి మండపంలో స్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం (అభిషేకం) నిర్వహించారు.

పూలపల్లకి సేవ

సోమవారం వేకువ జామున 2.30 గంటలకు తాళ్లకుళంలోని ప్రసిద్ధ కరుప్పన్నస్వామి ఆలయ సన్నిధిలో స్వామి వారు పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనమిస్తారు. పల్లకి సేవ అనంతరం, అళగర్‌స్వామి వారు తిరిగి అళగర్‌ మలైకు బయలు దేరి వెళ్తారు.మంగళవారం అప్పన్‌ తిరుపతి మీదుగా స్వామి వారి ఊరేగింపు కొనసాగుతుంది. బుధవారం అళగర్‌ కొండకు చేరుకున్న తర్వాత నిర్వహించే ప్రత్యేక శాంతి పూజలతో ఈ ఏడాది మధురై చిత్తిరై ఉత్సవాలు అధికారికంగా ముగుస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement