తిరువళ్లూరు: జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన క్రమంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరువళ్లూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, మాధవరం, మధురవాయల్, తిరువొత్తియూరు, ఆవడి, అంబత్తూరు తదితర పది అసెంబ్లీ స్తానాలకు గత 23న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం గుమ్మిడిపూండి, పొన్నేరి, తిరుత్తణి, తిరువళ్లూరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను సెవ్వాపేట పాలిటెక్నిక్ కళాశాలలోనూ, ఆవడి, అంబత్తూరు, తిరువొత్తియూరు, మాధవరం, మధురవాయల్, పూందమల్లి నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పెరుమాట్టులోని శ్రీరామ్ కళాశాల, విద్యామందిర్ కేంద్రాల్లో భద్రపరిచి అక్కడ మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంబించనున్నారు. 8.30 గంటలకు ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలకు సెల్‌ఫోన్ అనుమతించబోమని స్పష్టం చేశారు.


