సాక్షి, చైన్నె : ఓట్ల లెక్కింపు ప్రక్రియ న్యాయ బద్ధంగా జరగాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను టీవీకే విజ్ఞప్తి చేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, ఈ కేంద్రాలకు ఒక కి.మీ దూరం నుంచే ఇతరులను అనుమతించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాల లెక్కింపు రోజున, ఆ తర్వాత అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలు, తదుపరి చర్యలపై టీవీకే అధినేత విజయ్ కేడర్‌కు శుక్రవారం దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఏ సమయంలోనైనా సరే, వెంటనే పనయూర్‌కు వచ్చి తనను కలవాలి అని విజయ్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు , అభ్యర్థులు నిర్మల్‌కుమార్, సెంగోట్టయన్, విల్సన్,ఆధవ్ అర్జున వంటి నేతలు తమ సూచనలు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల సమయంలో డీఎంకే అసాధారణ పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓటమి భయంతో డీఎంకే ఏదైనా చేయవచ్చు అని అలెర్ట్ చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత న్యాయంగా, పారదర్శకంగా జరగాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేయడమే కాకుండా, టీవీకే నాయకులు, కార్యకర్తలకు అదనపు భద్రత కల్పించాలని డీజీపీకి లేఖ పంపించారు. ఇక, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, 4వ తేదీ ఫలితాలలో ప్రజా తీర్పు కీలకం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించడం గమనార్హం.
భద్రత పెంచాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించాలని, లెక్కింపు కేంద్రాల చుట్టూ ’స్టైరెల్ జోన్’ ఏర్పాటు చేయాలని టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున కోరారు. ఈ మేరకు ఆయన తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శివజ్ఞానంలను రాష్ట్ర సచివాలయంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు.
స్టైరెల్ జోన్ ఏర్పాటు
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడడానికి ప్రతి లెక్కింపు కేంద్రం చుట్టూ కిలోమీటరు పరిధిలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని (స్టైరెల్ జోన్ ఏర్పాటు చేయాలని) లేఖలో కోరారు. ఇప్పటికే శ్రీరంగం నియోజకవర్గంలోని 139వ నంబర్ టీవీకే పార్టీ కార్యాలయానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని, ఈ ఘటన ప్రింట్ , విజువల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైందని ఆధవ్ అర్జున గుర్తు చేశారు. టీవీకే పార్టీకి చెందిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా అడ్డుకోవడానికి, కౌంటింగ్ కేంద్రాల వద్ద అలజడులు సృష్టించడానికి కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రణాళికలు వేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులోని మొత్తం 62 కౌంటింగ్ కేంద్రాల వద్ద తగినంత మంది సాయుధ పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రత కల్పించాలని, కౌంటింగ్ కేంద్రాల వద్ద టీవీకే అభ్యర్థులు, ఏజెంట్ల వ్యక్తిగత భద్రతకు భరోసా కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా, శాంతియుతంగా వెలువడేలా ఈ విషయాన్ని అత్యంత అత్యవసరమైనదిగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా విజయ్ శనివారం వేలంకన్ని, నాగుర్ దర్గాలను సందర్శించనున్నట్టు తెలిసింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో చివరకు ఆ పర్యటనను విజయ్ రద్దు చేసుకున్నట్టు సమాచారం.
ఎన్నికల అధికారికి వినతి పత్రం ఇచ్చి వస్తున్న ఆధవ్ అర్జున, విజయ్


