క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

May 3 2026 7:41 AM | Updated on May 3 2026 7:41 AM

● ఇంటిముందు ఆడుకుంటుండగా ప్రమాదం

సంగీతం అర్థం చేసుకోవాలి

కొరుక్కుపేట: సంగీతం కేవలం నేర్చుకుంటే సరిపోదని దాన్ని అర్థం చేసుకోవాలని మ్యూజికాలజిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌ఎల్‌ రమేష్‌ అన్నారు. చైన్నె వేదికగా పృథ్వి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎల్‌ఎస్‌.రమేష్‌ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరిగింది. ఇందులో ఆయన కర్ణాటక సంగీతంలోని కొన్ని రాగాలు, వెస్ట్రన్‌ నోట్స్‌లోని స్కేల్స్‌ తో అతి సులువుగా మ్యూజిక్‌ కంపోజ్‌ ఎలా చేయొచ్చో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఐఐటీ డిప్యూటీ డైరెక్టర్‌.సెంథిల్‌ గారు, ఎస్‌పీ.వసంతలక్ష్మి, బాలాంత్రపు లావణ్య దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని పృథ్వీ సంస్థ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ శివకుమార్‌, కళైమామణి మాధవపెద్ది రమణమూర్తి, తమిళ రచయిత.ఇళంగోవన్‌ పాల్గొన్నారు.

బస్సు కింద పడి

చిన్నారి మృతి

తిరువొత్తియూరు: ధర్మపురి జిల్లాలో ఇంటి ముందు అనుకుంటున్న 2 ఏళ్ల చిన్నారి బస్సు చక్రం కింద పడి మృతి చెందింది. ధర్మపురి జిల్లా, పాలకోడ్‌ సమీపంలోని స్వామియార్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన కూలీ కార్మికులు కుమార్‌ – కావ్య దంపతుల 2 ఏళ్ల కుమార్తె వినోదిని. ఈ చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటోంది. పాలకోడ్‌ బస్సు నిలయం నుండి బెల్‌ రాంపట్టికి వెళ్లాల్సిన 19వ నంబర్‌ సిటీ బస్సు పాడవడంతో, దానికి బదులుగా 4వ నంబర్‌ బస్సును నడిపారు. ఆ బస్సు స్వామియార్‌ నగర్‌ ప్రాంతంలో వెళ్తుండగా, ఇంటి ముందు ఆడుకుంటున్న వినోదినిపై బస్సు వెనుక చక్రం ఎక్కింది. దీంతో ఆ చిన్నారి తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. సమాచారం అందుకున్న మారండహళ్లి పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు ఢీకొని ఇద్దరు..

తిరువొత్తియూరు: కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతిచెందారు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి కాలు తెగిపోయింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపం ఉరైయూర్‌కు చెందిన రంజిత (28), మల్లిక (28). వీరిద్దరూ కీరైకొల్లైలోని ముంత మామిడి తోటల్లో జీడిపప్పు వలిచే కూలీలు. వీరు ప్రతిరోజూ బస్సులో కొల్లుకారన్‌కుటైకి వెళ్లి అక్కడి నుంచి తమతో పాటు పనిచేసే కాడాంబులియూర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ (45) అనే వ్యక్తి బైక్‌లో తోటలకు వెళ్లేవారు. శనివారం యథావిధిగా బైక్‌ వెళుతుండగా కీరైకొల్లై బస్టాప్‌ సమీపంలో అరుణ్‌ బైక్‌ను కుడివైపునకు తిప్పాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత, మల్లిక అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌ నడుపుతున్న అరుణ్‌ కాలుపూర్తిగా తెగిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని కోరుతూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో చేశారు.

పిడగు పడి

10 మందికి గాయాలు

అన్నానగర్‌: మంగళాదేవి కన్నగి ఆలయంలో చిత్తిరై తిరువిళ్‌ ఉత్సవం జరుగుతుండగా పిడుగుపడి 10 మంది గాయపడ్డారు. తేని జిల్లాలోని కూడలూరు సమీపంలో తమిళనాడు–కేరళ సరిహద్దులో మంగళాదేవి కన్నగి ఆలయం ఉంది. ఆలయంలో చిత్తిరై తిరువిల్‌ ఉత్సవం శుక్రవారం జరిగింది. ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు జరుగుతుండగా ఆలయం వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన సాయుధ పోలీసు అధికారి అన్సార్‌, కేరళకు చెందిన శ్రీలక్ష్మి చేతికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే కేరళ వైద్య కళాశాలలో చేర్పించారు.

ఎస్‌ఐను కత్తితో బెదిరించిన యువకుడి అరెస్ట్‌

తిరువొత్తియూరు: గుమ్మడి పూండి సమీపంలో సబ్‌ ఇన్స్పెక్టర్‌కు కత్తిని చూపి బెదిరింపులు ఇచ్చిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపంలోని రెట్టాంబెడు నుండి చోళవరం వైపు వెళ్లే రహదారిపై శుక్రవారం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బలరామన్‌ , కానిస్టేబుల్‌ దినేష్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా రోడ్డు పక్కన నిలబడి ఉన్న చిన్న చోళవరం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు సంతోష్‌ (23)ని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి వున్నట్టు తెలిసింది. దీంతో అతని వద్ద 100 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిని విచారణ చేస్తున్న సమయంలో సంతోష్‌ కత్తితో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బలరామన్‌ను చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. ఫిర్యాదుపై గుమ్మిడిపూండి పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement