సాక్షి, చైన్నె : చెట్టినాడ్ రాజకుటుంబానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, కుమార రాణి డాక్టర్ మీనా ముత్తయ్య(91) శనివారం కన్నుమూశారు. ఆమె మరణంపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వివరాలు.. 1934 సెప్టెంబర్ 25న జన్మించిన డాక్టర్ మీనా ముత్తయ్య దాతృత్వానికి , విద్యా సేవకు మారుపేరైన రాజరీక కుటుంబం నుండి వచ్చారు. అన్నామలై విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా సర్ అన్నామలై చెట్టియార్‌కు ఆమె మనవరాలు. అలాగే డాక్టర్ ఎం.ఏ.ఎం. ముత్తయ్య చెట్టియార్‌కు భార్య. ఆమె క్వీన్స్ మేరీస్ కాలేజీ నుండి ఎకనామిక్స్‌లో బీఏ, హిస్టరీలో ఎంఏ పట్టా పొందారు. ఆమె నాయకత్వంలో చెట్టినాడ్ విద్యాశ్రమం చైన్నెలోనే అత్యంత ప్రసిద్ధ విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగింది.
ఉన్నత విద్యకు ప్రోత్సాహం
పాఠశాల విద్యతోనే ఆగకుండా, కుమారరాణి మీనా ముత్తయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ను స్థాపించి ఉన్నత విద్యను సైతం విస్తరించారు. చారిత్రక తంజావూరు చిత్రకళకు ఆమె మళ్లీ ప్రాణం పోశారు. తంజావూరు పెయింటింగ్స్ మూలాలు, వాటి అభివృద్ధిపై ఆమె డాక్టరేట్ పూర్తి చేశారు. పెరియార్ మణియమ్మై విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేసింది.
లివింగ్ క్రాఫ్ట్ ట్రెజర్ అవార్డు
తంజావూరు పెయింటింగ్‌ను ప్రోత్సహించినందుకు గానూ తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ’పూంబుహార్ ’ సంస్థ 2016–17 సంవత్సరానికి లివింగ్ క్రాఫ్ట్ ట్రెజర్ ప్రతిష్టాత్మక అవార్డును అందించింది. 2018లో జరిగిన మద్రాస్ వీక్ వేడుకల్లో ఆమెను ఈ గౌరవంతో సత్కరించారు.డాక్టర్ మీనా ముత్తయ్య విద్యతో పాటు అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘సీజన్ ఆఫ్ షేరింగ్‘ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించారు. అన్నామలై పాలిటెక్నిక్ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కంప్యూటర్ అక్షరాస్యతను ప్రోత్సహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కనడుకాతన్‌లో ’కుమారరాణి మీనా ముత్తయ్య మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్’ను ఏర్పాటు చేశారు. విద్యా, కళా, సామాజిక రంగాల్లో ఆమె చేసిన అపారమైన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులు ఆమెకు నివాళులర్పిస్తున్నారు.
సీఎం నివాళి
సీఎం స్టాలిన్ ఎక్స్‌పేజీ వేదికగా నివాళులర్పించారు. వ్యక్తిగతంగా కూడా ఆమె తమ కుటుంబంతో ఎంతో మంచి స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించారన్నారు. గత 2018వ సంవత్సరంలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆమె హాజరై ప్రసంగించారని గుర్తు చేస్తూ, కుమారరాణి మీనా ముత్తయ్య మరణం భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు. ఆమె మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు, ఆమె స్థాపించిన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ముఖ్యమంత్రి స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.


