సాక్షి, చైన్నె : శాకాహారానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ’వరల్డ్ వెజ్ కౌన్సిల్’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం చైన్నెలోని జరిగింది. మ్యూజిక్ అకాడమీలో జరిగిన వేడుకలో కౌన్సిల్ నూతన అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఎస్. మహావీర్ చంద్ బొత్రా, అంతర్జాతీయ కార్యదర్శిగా సుధాకర్ నారాయణస్వామి అంతర్జాతీయ కోశాధికారిగా ఆర్. మురళీ రావు బాధ్యతలు స్వీకరించారు. మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా 1959లో దివంగత రుక్మిణి దేవి అరుండేల్ ఒక స్వచ్ఛంద , రాజకీయేతర సంస్థగా ది ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ అనే పేరుతో స్థాపించారు. సభ్యత్వం అంతర్జాతీయంగా విస్తరించడంతో 2012లో దీని పేరును ’వరల్డ్ వెజ్ కౌన్సిల్’గా మార్చారు. శాకాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడం, ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తులపై శాకాహారానికి గుర్తుగా ఉండే ’గ్రీన్ డాట్’ (పచ్చని చుక్క) తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలకు సూచనలు చేయడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఈ సంస్థకు భారతదేశంతో పాటు యూకే, యూఎస్‌ఏలలో 2000 మందికి పైగా సభ్యులు ఉన్నారు.
న్యాయం అనేది కీలకం
ముఖ్య అతిథి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ప్రసంగిస్తూ, ‘న్యాయం అనేది కేవలం కోర్టు గదులకే పరిమితం కాదన్నారు. సమాజంలో కూడా అవసరం అని, అహింస అనే సిద్ధాంతంతో భారతదేశం ఎప్పుడూ శాకాహారానికి పుట్టినిల్లుగా ఉందన్నారు. శాకాహారం అనేది కేవలం ఆహార నియంత్రణ మాత్రమే కాదని,ఇది ఒక సంస్కారవంతమైన జీవన విధానంగా పేర్కొన్నారు. ఇది తోటి ప్రాణులపై సానుభూతిని, పర్యావరణ సమతుల్యతను పెంపొందిస్తుందన్నారు. ఈ సంస్థ శాకాహారంతో పాటు ప్లాస్టిక్ రహిత జీవనాన్ని కూడా ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు.ఈ సంస్థ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ఎన్. తారాచంద్ దుగర్ మాట్లాడుతూ.. ‘ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పరిశోధనల ప్రకారం, శాకాహారులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 33 శాతం తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. నూతన అధ్యక్షుడు మహావీర్ చంద్ బొత్రా మాట్లాడుతూ, తాము మాంసాహారులకు వ్యతిరేకం కాదు, కానీ శాకాహారం వల్ల కలిగే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ అంతర్జాతీయ కార్యదర్శి ఎస్. శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.


